ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న టీడీపీ 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు గుర్రాలు ఎక్కే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరుగుతోంది. వ్య‌క్తుల ప్ర‌భావం.. పార్టీ ప్ర‌భావం వెర‌సి.. టీడీపీకి కొత్త సంవ‌త్స‌రం.. భారీ ఎత్తున మేలు చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ఈ ద‌ఫా అనంపురంలో క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నా రు. వైసీపీ త‌ర‌ఫున ఇప్ప‌టికే.. చాలా మందికి సీట్లు క‌న్ఫ‌ర్మ్ చేశారు. క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉష ను.. పెనుకొండ‌కు మార్చారు. కానీ, ఇక్క‌డ ఆమె గెలుపు కాదు క‌దా.. క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్క‌ద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

ఇక‌, పెనుకొండ ఎమ్మెల్యే శంక‌ర‌నారాయ‌ణ‌ను అనంత ఎంపీగా పంపించారు. కానీ, జేసీల దూకుడుకు శంక‌ర‌నారాయ‌ణ బ్రేకులు కూడా వేయ‌లేర‌ని చెబుతున్నారు. అదేవిధంగా హిందూపురంలో ఎవ‌రు వ‌చ్చినా.. బాల‌య్య‌దే గెలుపని నొక్కి చెబుతున్నారు. ప‌య్యావుల కేశ‌వ్ ఉర‌వ‌కొండ‌లో వ‌రుస గెలుపు త‌థ్య‌మ‌ని అంటున్నారు. తాడిప‌త్రి, అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి, రాప్తాడు, ధ‌ర్మ‌వ‌రం.. టికెట్లు టీడీపీ ఖాతాలోనే ప‌డ‌తాయ‌ని అంటున్నారు.

ఇక‌, ఉమ్మ‌డి కృష్ణాలోనూ టీడీపీకిసానుకూల ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయ‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. మైల‌వ‌రంలో దేవినేని ఉమా గెలుపు త‌థ్య‌మేనని చెబుతున్నారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఈ సారి టీడీపీ ఖాతాలోనే ప‌డుతుంద‌ని.. ఇక్క‌డ బొండా ఉమా  గెలుపు ఇప్ప‌టికే నిర్ణ‌యం అయిపోయిం దని అంటున్నారు. ఏమాత్రం నియోజ‌క‌వ‌ర్గంతో ట‌చ్‌లోలేని వెల్లంప‌ల్లిని ఇక్క‌డ వైసీపీ తీసుకువ‌చ్చింది.  ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ జ‌న‌సేన కొట్ట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. పెడ‌న‌, అవ‌నిగ‌డ్డ‌, విజ‌య‌వాడతూర్పు.. టీడీపీ ఖాతాలో ప‌డ‌నున్నాయ‌ని అంటున్నారు.

అదేవిధంగా రాజ‌ధాని ఎఫెక్ట్ ఉన్న గుంటూరు , ప్ర‌కాశం జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ గెలుపు రాసిపెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లోనే నాలుగు స్థానాలు ద‌క్కించుకున్న ప్ర‌కాశంలో ఈ ద‌ఫా.. క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ-జ‌న‌సేన కూట‌మి గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని అంటున్నారు. కీల‌క‌మైన ఈ రెండు జిల్లాల్లో 25 నుంచి 27 స్థానాలు ఈ కూట‌మికి ద‌క్కుతాయ‌ని చెబుతున్నారు. మొత్తంగా.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కే నియోజ‌క‌వ‌ర్గాల‌ను ముందుగానే రాసిపెట్టుకోవ‌చ్చ‌ని అంటున్నారు.