కలివిడిగా.. ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించిన టీడీపీ, జనసేనలు పండుగలను కూడా.. ఉమ్మడి గానే నిర్వహించుకుంటున్నాయి. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని తొలిరోజు నిర్వహించే భోగి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్.. అమరావతి రాజధాని ప్రాంతం మందడంలో నిర్వహించిన భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు.
అడ్డ పంచె కట్టుకుని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. అందరినీ పేరు పేరునా పలకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు హాజరయ్యారు. ఇక, ఇదే కార్యక్రమానికి మంగళగిరి నుంచి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. భోగి మంటలు అంటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు.. జీవో కాపీలను భోగి మంటల్లో తగులబెట్టారు.
చంద్రబాబు, పవన్.. టీడీపీ, జనసేన జెండా గుర్తులతో సహా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేశారు. కాగా మూడు రోజులపాటు ‘రా కదలిరా’ కార్యక్రమానికి టీడీపీ, జనసేన పార్టీలు పిలుపు నిచ్చాయి. గుంటూరు జిల్లాలోని టీడీపీ ఆఫీస్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో బోగి మంటల వేడుకలు జరిగాయి.
కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి!
‘కీడు తొలగాలి… ఏపీ వెలగాలి’ పేరుతో టీడీపీ నేతలు బోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ఇచ్చిన జీవో ప్రతులను బోగి మంటల్లో దగ్దం చేశారు. అలాగే వైసీపీ మ్యానిఫెస్టో జిరాక్స్ కాపీలను కూడా పలువరు దహనం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates