వైసీపీలో గురువు టీడీపీకి జంప్‌.. శిష్యుడు దారెటో..!

కైలే అనిల్ కుమార్‌. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే..ఇప్పుడు డిఫెన్స్‌లో ప‌డిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న‌కు టికెట్ ఇస్తార‌ని కొంద‌రు.. ఇవ్వ‌ర‌ని మ‌రికొంద‌రు టెన్ష‌న్ పెడుతున్నారు. మాల సామాజిక వ‌ర్గానికి చెందిన అనిల్‌.. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి ఇక్కడ విజ‌యం సాధించారు. అయితే..ఈయ‌న‌కు గురువుగా భావించే.. మ‌రో నేత‌.. కొలుసు పార్థ‌సార‌థి.. అప్ప‌ట్లోఅన్నీ తానై ఈయ‌న‌ను గెలిపించార‌ని అంటారు.

ఇప్పుడు కొలుసు పార్థ‌సార‌థి.. వైసీపీని వీడ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న‌కు మ‌రోసారి పెన‌మలూరు సీటే కావాల‌ని కొలుసుకోరుతున్నారు. దీనికి పార్టీ విభేదిస్తూ.. మ‌చిలీప‌ట్నం ఎంపీగా బ‌రిలో నిల‌వాల‌ని కోరుతోంది. ఈ నేప‌థ్యంలో అనేక చ‌ర్చ‌లు.. మంత్రాంగాలు కూడా పూర్త‌య్యాయి. కానీ, కొలుసుకు ఆశాభంగ‌మే ఎదుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆయ‌న శిష్యుడిగా ఉన్న కైలే ఎటు వెళ్లాలి? అనేది స‌మ‌స్య‌.

పైకి.. వైసీపీ నేత‌ను అని చెప్పుకొన్నా.. పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలోమాత్రం కైలే అంటే.. కొలుసు శిష్యుడిగా నే గుర్తింపు ఎక్కువ‌. ఆయ‌న ఫొటో కూడా కైలే కార్యాల‌యంలో ఉంటుంది. దీంతో కొలుసు తీసుకునే నిర్ణ‌యం పైనే కైలే నిర్ణ‌యం కూడా ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కొలుసు ఇక్క‌డ ఫండింగ్ చేశార‌ని కూడా చెబుతున్నారు. మొత్తంగా కైలే భ‌విత‌.. కొలుసు నిర్ణ‌యంపైనే ఆధార‌ప‌డి ఉంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు వైసీపీ ఈ ద‌ఫా కైలేకు టికెట్ ఇవ్వ‌ద‌న్న ప్ర‌చారం ఉంది.

ప్ర‌స్తుతం సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాల వర్గానికే చెందిన ఉప్పులేటి క‌ల్ప‌న వైపు వైసీపీ అడుగులు ప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు. టీడీపీ నుంచి వ‌ర్ల కుమార్ రాజా పోటీకి రెడీ అయిన నేప‌థ్యంలో ఆయ‌న‌ను బ‌లంగా ఢీ కొట్టేందుకు మ‌హిళ‌ను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కైలేకు ఇది కూడా సెగ పెడుతోంది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందోఅని ఆయ‌న వ‌ర్గం ఎదురు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం.