తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము కూడా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి అక్షింతలు పంచి ఉంటే గెలిచి ఉండేవాళ్లమని అన్నారు. ప్రస్తుతం అయోధ్య లో ఈ నెల 22న బాల రాముని విగ్రహం ప్రతిష్ఠ కానుంది. దీనిని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా అక్కడి అక్షింతలను ప్రజలకు పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. దీనిని ప్రస్తావిస్తూ.. కేటీఆర్ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించా రు. తాము కూడా యాదాద్రి అక్షింతలు పంపిణీ చేసి ఉంటే గెలిచేవాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. బీఆర్ ఎస్ సర్క్యులర్ పార్టీ అని.. అన్ని మతాలను సమానంగా చూస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక, తాజాగా వచ్చిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌పైనా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్-బీజేపీ బంధానికి రెండునోటిఫికేషన్లు వేర్వేరుగా రావడమే ఉదాహరణ అని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ కలవగానే ఎన్నికల పద్ధతి మారిపోయిందని విమర్శించారు. ఈ విషయంపై తాము హైకోర్టుకు వెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మరోవైపు.. పొత్తులపైనా కేటీఆర్ స్పందించారు.
తరచుగా కాంగ్రెస్ నేతలు బీఆర్ ఎస్ పార్టీకి .. బీజేపీతో పొత్తు ఉందని చేస్తున్న వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. తాము గతంలోనూ.. ఇప్పుడు.. ఇకపై కూడా బీజేపీనే కాదు.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, పెట్టుకోబోమని వ్యాఖ్యానించారు. పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామన్న కేటీఆర్.. ఇక నుంచి ఎమ్మెల్యేల చుట్టూ తాము తిరిగేది లేదన్నారు. ఎమ్మెల్యేలే తమ చుట్టూ తిరిగే వాతావరణం ఉంటుందని చెప్పారు. గత ఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యుడినని తెలిపారు. పాలనపై ఎక్కువగా స్పందించి.. పార్టీని విస్మరించామని.. అదే ఓటమికి కారణమైందని కేటీఆర్ చెప్పారు.
ప్రస్తుత ఓటమిని తాము.. కేవలం స్పీడ్ బ్రేకర్ మాదిరిగానే చూస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం కారు షెడ్డుకు వెళ్లలేదని.. కేవలం సర్వీసింగ్‌కు మాత్రమే వెళ్లిందని చెప్పారు. తాజాగా తెలంగాణ భవన్‌లో భువనగిరి పార్లమెంట్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను శాసించే పరిస్థితి ఇకపై ఉండబోదన్నారు. పార్టీ ఓటమికి ప్రజలు కారణం కాదని.. నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. పార్టీలో ఏం జరుగుతోందో కేసీఆర్ అన్నీ తెలుసుకుంటున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు.