టీడీపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంపై పేటెంట్ తనదేనని అన్నారు. ఇక్కడ ఎవరికీ స్థానం లేదన్నారు. తానే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొంటానని, ఈ దైర్యం తనకు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గత నాలుగు రోజులుగా ఆయన నియోజకవర్గంలోని వాడ వాడలా తిరుగుతున్నారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో రంగం రెడీ చేసుకుంటున్నారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు కు గ్యారెంటీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తు న్నారు. ‘‘దెందులూరులో నా చెమట, నా రక్తం, మీ కష్టం అన్నీ ఉన్నాయిఅని చింతమేనేని అన్నారు. వీటన్నింటిని కలబోసి రాజకీయం చేస్తున్నానని చెప్పారు.ఎవడుపడితే వాడు, ఎక్కడపడితే అక్కడ నాలుగు రూపాయలున్నాయి కదా అని బ్యాగులేసుకొస్తే వెంట్రుక కూడా పీకలేరు“ అని నిప్పులు చెరిగారు.
నాయకుడు అనే వాడు ప్రజల్లో నుంచే పుడతాడన్న చింతమనేని.. తాను అలానే ప్రజల నుంచి వచ్చిన మాస్ లీడర్‌నని చెప్పుకొచ్చారు. దెందులూరు ప్రజలు అమాయకులు కాదని, ఇక్కడ ఎవరిని గెలిపించాలో వారికి బాగా తెలుసునని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ భారీ మెజారిటీతో విజయం దక్కించుకుంటుందని.., చంద్రబాబుకు బంగారు పళ్లెంలో పెట్టి ఈ విజయాన్ని కానుకగా అందిస్తానని చింతమనేని చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే.. 2014లో విజయం దక్కించుకున్న చింతమనేని అనేక వివాదాల్లో కూరుకుపోయారు. అయినప్పటికీ.. 2019 ఎన్నికల్లోనూ చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు. ఇదేసమయంలో వైసీపీ తరఫున ఎన్నారై.. అబ్బయ్య చౌదరి ఇక్కడ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు ఈయనను మార్చే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనేచింతమనేని మరింత దూకుడు పెంచారని అంటున్నారుపరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates