అంబటి రాయుడు. ఇటీవల కాలంలో రాజకీయాల్లో భారీ ఎత్తున వినిపించిన పేరు. భారత మాజీ క్రికెటర్‌గా మంచి పేరు, అభిమానులను సంపాయించుకున్న రాయుడు స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా. కొన్నాళ్ల కిందటే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడు ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి ముందే ఆయన గుంటూరులోని పలు గ్రామాల్లో పర్యటించారు. అయితే.. ఏమైందో ఏమో.. అనూహ్యంగా పార్టీలో చేరిన ఆరు రోజుల వ్యవధిలోనే ఆయన బయటకువచ్చేశారు.
వైసీపీ కండువా మాయను కూడా మాయకముందే.. రాయుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఇటీవల సంచలనంగా మారింది. దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. వైసీపీని కార్నర్ చేస్తూ.. టీడీపీ సహా ఇతర పార్టీలు ఏకేశాయి. అంబటి ముందుగానే వైసీపీ నైజం తెలుసుకున్నారని.. పలువురు నాయకులు విమర్శలు గుప్పించారు. అయితే.. దీనిపై వివరణ ఇచ్చిన అంబటి.. తానుదుబాయ్ లో జరగనున్న ఓ టోర్నీలో పాల్గొంటున్నానని.. దీనికి , రాజకీయాలకు సంబంధం ఉండకూడదని.. అందుకే.. బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు.
కట్ చేస్తే.. అందరూ దీనిని నిజమనే అనుకున్నారు. అయితే.. ఇప్పుడు మరో సంచలన వార్త తెరమీదికి వచ్చింది. తాజాగా మంగళవారం రాత్రి ఎవరి కంటా పడకుండా.. రాయుడు జనసేన అధినేత పవన్‌తో భేటీ అయ్యారనే విషయం సంచలనంగా మారింది. అంతేకాదు.. గుంటూరుకు చెందిన కీలక నాయకుడు ఒకరితోనూన ఆయన టచ్‌లోకి వెళ్లారని చెబుతున్నారు. దీంతో రాయుడు రాజకీయం.. జనసేన కేంద్రంగా సాగే అవకాశం ఉందని.. త్వరలోనే ఆయన ఈ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ సాగుతోంది. ఏదేమైనా.. అమ్మ రాయుడూ.. పాలిటిక్స్ బాగానే ఒంటబట్టాయే! అంటున్నారు అభిమానులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates