మైత్రి దగ్గరే దేవికి ఈ పంచాయితీ ఏంటో?

టాలీవుడ్ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్‌ది సపరేట్ స్టయిల్. కొంచెం టైం తీసుకుని అయినా ప్రత్యేకమైన పాటలు, బీజీఎం ఇవ్వాలని చూస్తాడు. హడావుడిగా సినిమాలు చేయడు. ఒక సినిమాకు సంగీతం అందిస్తుంటే.. అందులో వేరే మ్యుజీషియన్ల జోక్యాన్ని అతను ఇష్టపడడు. తాను వెళ్లి వేరే సినిమాలకు బీజీఎం ఇవ్వడం లాంటివి చేయడు. అలాగే తన సినిమాలో వేరొకరి భాగస్వామ్యాన్నీ తట్టుకోలేడు.

కానీ ‘పుష్ప: ది రూల్’ చిత్రానికి దేవికి అత్యంత సన్నిహితుడైన దర్శకుడు సుకుమారే.. వేరే వాళ్లను బీజీఎం కోసం తీసుకున్నాడు. తమన్, అజనీష్ లోక్‌నాథ్, సామ్ సీఎస్.. ఇలా ముగ్గురికి పని అప్పగించి, చివరికి సామ్‌ నుంచి కొంత కంటెంట్ తీసుకున్నాడు. ఈ విషయం దేవిని ఎంత బాధ పెట్టిందో ఆ సినిమా రిలీజ్ ముంగిటే బయటపడింది.

నిర్మాతల మీద తన అసహనాన్ని ఒక ఈవెంట్లో వెళ్లగక్కేశాడు దేవి. ఐతే ఆ వ్యవహారం త్వరగానే సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు దేవి సంగీతం అందిస్తున్న సినిమాకు మరొకరు బీజీఎం ఇవ్వడం మళ్లీ చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు తమన్‌ను బీజీఎం కోసం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26 నుంచి 19కి ప్రి పోన్ చేస్తున్న నేపథ్యంలో ఆ టైంకల్లా సినిమాను రెడీ చేయడం కోసం తమన్‌కు బీజీఎం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

దేవి పని కొంచెం నెమ్మదిగా చేస్తాడని, తమన్ సూపర్ స్పీడ్ అని తెలిసిన విషయమే. పైగా దేవి ఫోకస్ ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న ‘యల్లమ్మ’ మీద కూడా ఉంది. సినిమాను ప్రి పోన్ చేస్తున్న నేపథ్యంలో తప్పకే తమన్‌ను తీసుకుంటున్నప్పటికీ.. దేవి ఈ విషయాన్ని తట్టుకోగలడా అన్నది ప్రశ్న.

ఈసారి హీరో, దర్శకుడు మారారు కానీ.. నిర్మాణ సంస్థ మాత్రం మైత్రీ మూవీ మేకర్సే. ‘పుష్ప-2’ విషయంలో నిర్ణయం సుకుమార్‌దే అయినా.. దేవి నిర్మాతల మీద పడిపోయాడనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు దేవితో మంచి రాపో ఉన్న హరీష్ శంకరే.. తమన్‌ వైపు మొగ్గాడు.

ఐతే మళ్లీ మైత్రీ సంస్థ సినిమాలోనే ఇలా జరగడంతో ఆ బేనర్‌తో దేవికి సంబంధాలు ఎలా ఉంటాయో.. మున్ముందు వాళ్లతో సినిమా చేస్తాడో లేదో అన్న సందేహాలు కలుగుతున్నాయి. నిజానికి ఈసారి అతను హర్ట్ అవ్వడానికి ఏమీ లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి దేవి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.