ఒక్క ఓటమి.. నాయకులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. మరోసారి గెలవాలన్న పట్టుదలనే కాదు.. భారీ మెజారిటీని దక్కించుకోవాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఇదే ఇప్పుడు టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ రాజకీయ బాటగా మారిందని అంటున్నారు పరిశీలకులు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్.. తొలిసారి మంగళగిరి నుంచి పోటీ చేశారు. అయితే.. ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.
అయినప్పటికీ.. పట్టుదలతో ఉన్న నారా లోకేష్.. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్న చందం గా.. మంగళగిరి నుంచే విజయం దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళగిరినే అంటిపెట్టుకుని ఉన్నారు. అనేక సూచనలు, సలహాలు వచ్చినా.. చివరకు తండ్రి చంద్రబాబుసైతం.. ఈ దఫా నియోజకవర్గం మార్చుకోవాలని సూచించినా.. నారా లోకేష్ మారేందుకు సిద్ధపడలేదు. అంతేకాదు.. మంగళగిరిలో అన్ని వర్గాలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
యువగళం పాదయాత్రలోనూ మంగళగిరికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, వారానికి ఒకసారి పర్యటించిన నారా లోకేష్ ఇప్పుడు వారానికి రెండు రోజులు అక్కడే ఉండేలా.. ప్రజలను కలిసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక, తాజాగా మంగళగిరి ప్రజాప్రతినిధులకు సెంటిమెంటు అయిన పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయడం గమనార్హం. ముఖ్యంగా వందల సంఖ్యలో ఉన్న మెట్లకు కూడా ఆయన సతీసమేతంగా పూజలు చేశారు.
మరోవైపు.. స్థానిక చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మొబైల్ దుకాణాలను ఉచితంగా అందిస్తూ ఆదు కుంటున్నారు. ఇక, మినీ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ దఫా ఎట్టి పరిస్థితిలోనూ విజయం సాధించాలనే పట్టుదలతో నారా లోకేష్ ముందుకు దూసుకుపోవడం గమనార్హం. ఒకరకంగా.. ఆయన స్థాయికన్నా.. ఎక్కువగానే ఇక్కడ కష్టపడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇది పార్టీలో ఇతర నేతలకు సైతం ఆదర్శంగా ఉంటుందని చెబుతున్నారు. మరి తమ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.