ఏపీలో జగన్ మోహన్‌రెడ్డి పాలన దారుణంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. అమరావతి మాత్రం వెలవెల బోతోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి జగనేనని విమర్శించారు. తాజాగా టీడీపీ చేపట్టి ‘రా.. కదలిరా!’ సభ ఉమ్మడి కృష్నాజిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో నిర్వహించారు.
ఈ సభలో పాల్గొన్న చంద్రబాబు.. ఆవేశ భరితంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అమరావతిని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్1గా నిలబడాలనేది తన లక్ష్యమని వెల్లడించారు. జగన్ రివర్స్ పాలనలో ప్రతి ఒక్కరూ బాధితులేనని చెప్పారు. “అసమర్థుడు ఉంటే.. రాష్ట్రం కొంత వరకు నష్టపోతుంది. కానీ, దుర్మార్గుడే పాలన చేస్తే.. రాష్ట్రం సర్వనాశనం అవుతుంది” అని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.
జగన్‌కు ప్రచారం పిచ్చి మరింత ముదిరిపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. పాసు బుక్కులు, చివరకు సరిహద్దు రాళ్లపైనా జగన్ తన బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు. తమ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు కూడా జగన్ తన బొమ్మలే వేయించుకున్నారని.. ఇంత ప్రచార పిచ్చి ఉన్న నాయకుడిని ఎక్కడా చూడలేదన్నారు. వచ్చేది రైతు రాజ్యమేనని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ఆటలు ఇక, సాగనివ్వనని అన్నారు.
“ఎలాగైనా గెలవాలని.. వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, వారి ఆటలు సాగనివ్వను. రుషికొండను బోడిగుండు చేసి.. 500 కోట్లతో విల్లా కట్టుకున్నారు. ఐదు కోట్ల ప్రజారాజధానిని పక్కన పెట్టి ప్రజలకు రాజధాని లేకుండా చేశాడు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ తన పాలనలో వంద సక్షేమ పథకాలను రద్దు చేశారని అన్నారు. “సైతాన్ ప్రభుత్వం పోవాలి.. రైతే రాజుగా మారాలి” అని చంద్రబాబు నినాదాలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates