ఏపీలో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే అనేక పార్టీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీంతో రాజకీయంగా రాష్ట్రంలో చర్చలు.. చేరికలు కూడా.. హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తాజాగా మరో పార్టీ ఆవిర్భవించేందుకు రెడీ అయింది. మాజీ ఐఏఎస్ అధికారి.. విజయకుమార్ కొత్తగా పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన విజయవాడలో సమావేశం నిర్వహించారు. దీనికి రాజకీయంగా తటస్థంగా ఉన్న నాయకులు, మేధావి వర్గాన్ని, యువతను ఆహ్వానించారు.
“పేదలు, బడుగుల కోసం.. ఓ నూతన వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో” అని పేర్కొంటూ నిర్వహించిన కార్యక్రమం విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోనే కొత్త పార్టీని ప్రకటించనున్నట్టు తెలిసింది. గత చంద్రబాబు హయాంలోను.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ హయాంలోనూ విజయకుమార్ పనిచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయనను కొన్నాళ్ల కిందట దూరంపెట్టింది.
వాస్తవానికి విజయకుమార్ రిటైరైన తర్వాత.. విద్యాశాఖ సలహాదారుగా తీసుకున్నారు. అయితే.. ఆయన పనితీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని.. ఆయన సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని.. పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆయనను పక్కన పెట్టారు. అప్పటి నుంచి మౌనంగా ఉన్న విజయ కుమార్‌ను టీడీపీ తమ పార్టీలోకి ఆహ్వానించినట్టు కొన్నాళ్ల కిందట వార్తలు వచ్చాయి.
గుంటూరు లేదా.. ప్రకాశం జిల్లాల్లోని నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తామనే ఆఫర్లు కూడా.. టీడీపీ ప్రకటించిందని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చసాగింది. అయితే.. విజయకుమార్ మౌనంగా ఉన్నారు. తాజాగా ఆయన సొంత కుంపటి పెట్టుకుని.. ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నట్టు రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఎస్సీ ఓటు బ్యాంకు, యువత ఓటుబ్యాంకు లక్ష్యంగా విజయకుమార్ రాజకీయాలు సాగే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates