జగన్ కు షాక్..అంబటి రాయుడు ఔట్

సీఎం జగన్ కు షాకిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్, వైసీపీ నేత అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో చేరి వారం రోజులు గడవక ముందే పార్టీకి రాజీనామా చేస్తున్నానని అంబటి రాయుడు చేసిన ప్రకటన ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ వీడుతున్నట్లు అంబటి రాయుడు చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని రాయుడు అన్నారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం ప్రకటిస్తానని అంబటి రాయుడు అన్నారు.

వాస్తవానికి వైసీపీతో అంబటి రాయుడికి చెడిందని ‘ఆడుదాం ఆంధ్రా’ ఆరంభ వేడుకలోనే ప్రచారం జరిగింది. ఆ ఈవెంట్ ప్రారంభానికి ముందు అన్ని ఏర్పాట్లలో చురుగ్గా వ్యవహరించిన అంబటి రాయుడు ఆ ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించకపోవడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడు వైసీపీలో చేరకుండానే ఆ పార్టీకి దూరమయ్యారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా కొద్ది రోజుల తర్వాత సీఎం జగన్ సమక్షంలో అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా అంబటి బరిలోకి దిగుతారని ప్రచారం కూడా జరిగింది.

అయితే, ఏం జరిగిందో తెలియదు గానీ పార్టీలో చేరిన వారంలోపే అంబటి రాయుడు హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు. అయితే, వైసీపీ అధిష్టానం ఒంటెత్తు పోకడలు, ఏకపక్ష ధోరణి నచ్చకపోవడంతోనే రాయుడు పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది. గతంలో ప్రపంచ కప్ సందర్భంగా తనను ఎంపిక చేయకపోవడంతో రాయుడు హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో వైసీపీకి కూడా అంబటి రాయుడు గుడ్ బై చెప్పారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు నేపథ్యంలో చాలామంది వైసీపీ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారిని స్ఫూర్తిగా తీసుకున్న అంబటి వారి బాటలోనే నడిచారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఏ స్థానంలో పోటీ చేయకుండానే, ఏ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ కాకుండానే అంబటి పార్టీ లో నుంచి వెళ్లిపోవడం సంచలనం రేపుతోంది. వైసీపీలో ‘సిట్టింగ్’ కాకుండానే అంబటి రాయుడు వాకౌట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి, అంబటి రాయుడు రాజీనామా పై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.