సీనియర్ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గం నేత.. కాపు రామచంద్రారెడ్డి తాజాగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను జగన్ నమ్మించి ద్రోహం చేశారని అన్నారు. తనకు టికెట్ ఇవ్వనని చెప్పి.. వంచించారని ఆయన విరుచుకుపడ్డారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన కాపును తాజాగా వైసీపీ పక్కన పెట్టింది. ఆయన స్థానంలో వేరేవారిని నియమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో కాపు బ్లాస్ట్ అయ్యారు.
సర్వే పేరు చెప్పి తన గొంతు కోశారని కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం, కళ్యాణ దుర్గం నుంచి రెండు చోట్ల తాను, తన భార్య పోటీ చేస్తామని స్పష్టం చేశారు. “రాయదుర్గం నుంచి నా భార్య తప్పని సరిగా పోటీ చేస్తారు. సీఎంను కలిసి మాట్లాడడం మాకు కుదరలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసే అవకాశం రాలేదు. కనీసం మేం వచ్చామని చెప్పినా.. పట్టించుకోలేదు. ఇంత కన్నా అవమానం మాకు ఎప్పుడు జరగలేదు. నమ్మించి మా గొంతు కోశారు. ఇకనైనా సొంత నిర్ణయంతో స్వతంత్రంగా లేదా అవకాశం కల్పించిన ఏ పార్టీ తరఫున అయినా పోటీకి సిద్దం” అని కాపు నిప్పులు చెరిగారు.
అయితే.. తాను ఏపార్టీలో చేరేదీ త్వరలోనే చెబుతానని కాపు తెలిపారు. ఇప్పటి వరకు ఇతర పార్టీలతో టచ్‌లోకి వెళ్లలేదన్నారు. “మా ఇంటి నిండా లైట్ లు వేస్తే జగన్ ఫోటో లే కనబడతాయి. వైసీపీ పెట్టినప్పుడు ఐదేళ్లు పదవీకాలం వదులుకొని వచ్చాను. 2014, 2019లో పోటీ చేయను అన్నా మంత్రి పదవి ఇస్తాను అని పోటీ చేయించారు. రాత్రి, పగలు గడప గడపకు తిరిగాను అయిన సర్వే పేరుతో టికెట్ నిరాకరించారు. మా జీవితాలు సర్వనాశనం అయ్యాయి. ఈ రోజు వరకు జగన్ మా దేవుడు అనుకున్నాం. జగన్ మా గొంతు కొస్తాడనుకోలేదు. స్వతంత్రంగా గెలిచే సత్తా కూడా మాకు ఉంది” అని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates