ఆపరేషన్ 15..సాధ్యమేనా ?

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది. తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి(టీపీసీసీ) సమావేశంలో రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు ఉదాహరణ. టీపీసీసీ సమావేశంలో రేవంత్ మాట్లాడుతు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 15 సీట్లను పార్టీ గెలుచుకోవాలని చెప్పారు. నేతలు, కార్యకర్తలు అందరు సమిష్టిగా పనిచేస్తే 17 సీట్లలో 15 సీట్లలో గెలవటం పెద్ద కష్టమేమీకాదన్నారు. 15 సీట్లలో గెలవాలని పిలుపిచ్చారు కానీ మిగిలిన రెండుసీట్లను రేవంత్ ఎందుకు వదిలేశారో అర్ధంకావటంలేదు.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు పార్టీ నేతలు, క్యాడర్ ఏకతాటిపైకి వచ్చి ఎలా పోరాడామో అదే స్పూర్తితో పార్లమెంటు ఎన్నికల్లో కూడా పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి పార్టీ పటిష్టంగా ఉండటం ఎంతో మేలుచేస్తుందన్నారు. పార్టీ అత్యధిక సీట్లలో గెలుచుకునేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిన కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ లో రెండింటిని ఇప్పటికే అమల్లోకి తెచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. మిగిలిన హామీలను కూడా అమలుచేయటానికి కసరత్తు జరుగుతోందన్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే టీపీసీసీ సమావేశానికి రేవంత్ తో పాటు మొత్తం మంత్రులంతా హాజరయ్యారు. రేవంత్ ముఖ్యమంత్రే కాకుండా ఇంకా పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కాబట్టి టీపీసీసీ సమావేశానికి హాజరుకావటం తప్పదు. అయితే మిగిలిన మంత్రలందరు సమావేశానికి హాజరవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే పార్టీ సమావేశాలకు మంత్రులందరు హాజరవ్వటం చాలా అరుదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో మొదటినుండి ఇదే పద్దతి నడుస్తోంది. పార్టీ సమావేశాలకు హజరయ్యేవాళ్ళు హాజరవుతారు లేనివాళ్ళు లేదంతే.

అభ్యర్ధుల ఎంపికను కూడా రేవంత్ జాగ్రత్తగా చేయబోతున్నట్లు సమాచారం. సీనియర్లను పరిగణలోకి తీసుకుంటూనే జూనియర్లకు కూడా టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. పార్టీని అధికారంలోకి తేవటంలో అధిష్టానం దగ్గర రేవంత్ ఇప్పటికే మంచి మార్కులు వేయించుకున్నారు. కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లను గెలిపిస్తే అధిష్టానానికి మరింత సన్నిహితమవటం ఖాయం. అందుకనే నేతలు, క్యాడర్ను ఏకతాటిపైన నడిపించేందుకు రేవంత్ శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.