కరోనా టైం..ప్రపంచంలో బెస్ట్ థింకర్ గా భారతీయురాలు

ప్రచారం, హంగు, ఆర్భాటాలే పరమావధిగా ఉన్న ఈ జమానాలోనూ ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్…అన్న మాటలను నమ్మిన పొలిటిషియన్లు కూడా ఉన్నారు. అటువంటి రాజకీయ నేతలలో ముందు వరుసలో కేరళ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కే.కే. శైలజ ఉంటారు. కరోనా విపత్తు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆ మహమ్మారిని ముందుగానే గుర్తించారు శైలజ. గుర్తించడమే కాదు….కరోనా కట్టడిలో ఏ మాత్రం అలసత్వ ప్రదర్శించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కేరళలో కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషించారు శైలజ. అందుకే, ఆమె కరోనా సంక్షోభంలో ప్రపంచంలోని టాప్ -50 థింకర్స్ లో నంబర్ వన్ గా నిలిచారు.

కేరళ ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో శైలజదే కీలక పాత్ర అంటే అతిశయోక్తి కాదు. అందుకే, కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో కేరళ ప్రభుత్వం, శైలజ కృషిని ఐక్యరాజ్యసమితి గతంలో కొనియాడింది. శైలజతో పాటు ఇతర నాయకులను పబ్లిక్‌ సర్వీస్‌ డే పురస్కరించుకుని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఆన్ లైన్ లో అభినందించారు. ఈ రకంగా భారతీయులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన శైలజ తాజాగా మరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. బ్రిటన్‌లోని ప్రముఖ మ్యాగజైన్ ప్రాస్పెక్ట్‌ నిర్వహించిన `ప్రపంచంలోని టాప్-50‌ థింకర్స్‌ సర్వేలో శైలజ నంబర్ వన్ గా నిలిచి మరోసారి భారతీయులు గర్వపడేలా చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విశేష కృషి చేసిన వారిలో టాప్-50 మంది ఎవరో తెలుసుకునేందుకు బ్రిటన్‌లోని ప్రాస్పెక్ట్‌ మ్యాగజైన్‌ ఓ సర్వే నిర్వహించింది. కరోనా సంక్షోభం సందర్భంగా తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి…అలుపెరుగని పోరాటం చేసిన 50 మంది బెస్ట్‌ థింకర్స్‌ ఎవరు అన్నదానిపై సర్వే చేసింది. లక్షల మంది పాల్గొన్న ఆ పోల్‌లో శైలజ మొదటి స్థానం దక్కించుకున్నారు. కరోనా కట్టడిలో విజయం సాధించిన న్యూజీలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెన్‌ ను వెనక్కు నెట్టి శైలజ నంబర్ వన్ గా నిలవడం విశేషం. టాప్‌ -50లో శైలజ మొదటి స్థానంలో నిలవగా, ఆర్డెన్ రెండో స్థానంలో ఉన్నారు.

టీచర్‌గానే సుప్రసిద్ధురాలైన శైలజ వామపక్ష నేతగానూ గుర్తింపు పొందారు. అందుకే, కరోనా విషయంలో అలసత్వం ప్రదర్శించలేదు. అనవసర ఆర్భాటాలకు, ప్రచారాలకు పోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన టెస్ట్‌, ట్రేస్‌, ఐసోలేట్‌ను అక్షరాలా పాటించారు. ఎయిర్‌పోర్టులలో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించి….చైనా నుంచి వచ్చేవారిపై ఫోకస్ పెట్టారు. క్వారంటైన్‌, సోషల్ డిస్టెన్సింగ్‌, మాస్కులు వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. కరోనా విపత్తు కంటే ముందు నిఫా వైరస్‌, 2018-19 సంవత్సరాలలో వచ్చిన రెండు వరదలను ఎదుర్కోవటంలోనూ శైలజ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషించింది. ఆ అనుభవమే కోవిడ్‌-19 నియంత్రణ కోసం ఉపయోగపడిందంటారు శైలజ. భారతీయులందరినీ గర్వపడేలా చేసిన శైలజ మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలకు ఆదర్శం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.