లోకేష్ – చంద్ర‌బాబు – ప‌వ‌న్.. ఈ కామ‌న్ పాయింట్ చూశారా…!

ఒకే సారి .. ఒకే స‌మ‌యంలో ప‌క్కాషెడ్యూల్‌. ఒకే సారి మూడు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చేఎన్నిక‌ల‌కు స‌మ‌యం పెద్ద‌గా లేక‌పోవ‌డం.. రాష్ట్రంలో అభ్య‌ర్థుల ఎంపిక‌కు ముందు.. మ‌రోసారి వేడి ర‌గిలించ‌డం.. వైసీపీని త‌ట్టుకుని నిల‌బ‌డేలా.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగ‌డం వంటి ల‌క్ష్యాల‌తో ఈ ముగ్గురు ప‌ర్య‌ట‌న‌ల‌కు రెడీ అవుతున్నారు.

చంద్ర‌బాబు విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఆయ‌న సీమ ప్రాంతంలో ప‌ర్య‌టించాల‌ని భావిస్తున్న‌ట్టుతెలుస్తోంది. ఇక్క‌డ బ‌ల‌మైన వైసీపీ ఓటు బ్యాంకు ఉంది. దీనిని చంద్ర‌బాబు ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌ని భావిస్తున్నారు. త‌న ఇమేజ్‌తోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అనుస‌రించే ప‌థ‌కాలు.. వంటివాటిని స‌మ‌ర్థ‌వంతంగా వివ‌రించ‌డంతోపాటు.. అభ్య‌ర్థుల‌పై నా చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మొత్తం ఉమ్మ‌డి నాలుగు జిల్లాల్లో(చిత్తూరు, క‌డ‌ప‌, అనంత‌పురం, క‌ర్నూలు) చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లు సాగ‌నున్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇక‌, నారా లోకేష్ వ్య‌వ‌హారం చూస్తే.. ఆయ‌న కోస్తా జిల్లాల‌పై దృష్టి పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. గుంటూ రు, కృష్ణా, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనారా లోకేష్ ప‌ర్య‌టించ‌నున్నార‌ని అంటున్నారు. ఈ జిల్లాల్లో టీడీపీ చాలా బ‌లంగా ఉంది. పైగా రాజ‌ధాని ఎఫెక్ట్ కూడా ఉంది. దీంతో మ‌రింత బ‌లం పుంజుకునేలా నారా లోకేష్ త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాథ‌మికంగా..  ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై ఫోక‌స్ పెంచ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇప్ప‌టికే విశాఖ‌, శ్రీకాకుళం, విజ‌య‌నగ‌రం జిల్లాల్లో ఈ ఏడాది భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించారు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ లేదా.. శ్రీకాకుళం నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఈ మూడు జిల్లాల్లో జ‌న‌సేన‌-టీడీపీ మిత్ర‌ప‌క్షాన్ని బ‌లోపేతం చేసే దిశ‌గా ఆయ‌న ప‌ర్య‌ట‌న సాగుతుంద‌ని  చెబుతున్నారు. మొత్తంగా ఈ ముగ్గ‌రు నాయ‌కులు కూడా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి త‌ర్వాత 15 రోజ‌లు పాటు వ‌రుస స‌మావేశాలు, బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తార‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.