“ఒక్క ఛాన్స్ ఇప్పించండి.. ప్లీజ్.. జగన్ ను కలుస్తా.. నా మనసులో మాట చెబుతా. నాకు తీవ్ర అన్యాయం జరిగింది“ అని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు గుంటూరు రాజకీయాలను వేడెక్కిం చాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాడికొండ నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తనను అర్ధాంతరంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. పార్టీలో తాను విశ్వసనీయంగా ఉన్నానని చెప్పారు.
‘‘ఆగస్టు 19వ తేదీన నన్ను తాడికొండ సమన్వయ కర్తగా నియమిస్తే.. ఆగస్టు 24న (వారం రోజుల్లో) తొలగించారు. సర్వేల్లో మీకు వ్యతిరేకంగా నివేదిక వచ్చింది ఆగిపోవాలని చెప్పారు. మరొకరిని సమన్వయ కర్తగా నియమించారు. తాడికొండ వైసీపీ అభ్యర్థి నేనే అని సీఎంతో సహా పార్టీలోని పెద్దలు చెప్పారు. ఆ తర్వాత సుచరితను ఎంపిక చేశారు. సీఎం జగన్‌ను కలిసే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరుతున్నా. వచ్చే ఎన్నికల్లో సుచరిత విజయం కోసం పనిచేస్తా’’ అని డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రకటించారు.
సీఎం జగన్ ఏది చెబితే అదే జరుగుతుందని, అందరూ ఆమోదించాల్సిందేనని కూడా మరోవైపు డొక్కా అనడం గమనార్హం. ఇదిలావుంటే.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన డొక్కా ఓడిపోయారు. అప్పటికే ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. ఇక, ఓటమి తర్వాత.. వైసీపీలోకి వచ్చారు. మళ్లీ ఇక్కడ కూడా ఎమ్మెల్సీగా కొనసాగారు. ఈ క్రమంలోనే డొక్కా సొంత నియజకవర్గం, ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం తాడికొండకు ఇంచార్జ్‌గా నియమించారు. ఇదేవైసీపీలో ముసలానికి దారితీసింది.
గత ఎన్నికల్లో తాడికొండ నుంచి విజయం దక్కించుకున్న డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని తప్పించేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె రెబల్‌గా మారారు. ఆ తర్వాత.. డొక్కాకు పూర్తిస్థాయిలో పగ్గాలు అప్పగించారు. అయితే.. ఆయన నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేడర్ సహకరించలేదు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి.. తర్వాత టీడీపీలోకి వచ్చి.. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారు తమకు అవసరం లేదని నియోజకవర్గం ప్రజలు తేల్చి చెప్పారు. దీంతో ఆయనను వైసీపీ తప్పించింది. ఈ క్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరితకు ఇక్కడ పగ్గాలు అప్పగించింది. ఇది కూడా.. ఇప్పుడు వివాదంగానే ఉంది. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates