`డీప్ ఫేక్` టెక్నాలజీ.. ఇటీవల కాలంలో దేశంలో సంచలనంగా మారిన వ్యవహారం గురించి తెలిసిందే. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గార్భా నృత్యం చేస్తున్నట్టుగా.. వివిధ సినీ తారల చిత్రాలను అసభ్యంగా చూపించిన ఘటనలు దేశంలో సంచలనం సృష్టించాయి. దీనిపై ప్రధాని సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వ్యవహారం.. దేశ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరో మూడు మాసాల్లో దేశవ్యాప్తంగా పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఎన్నికలపైనా డీప్ ఫేక్ ప్రభావం ఉండే అవకాశం ఉందని ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు ఇది మరింత పెద్ద సమస్యగా మారనుందని కేంద్రం చెబుతోంది.
“డీప్‌ఫేక్‌ల ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీనిపై సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫాం సంస్థలను హెచ్చరించినప్పటికీ.. డీప్‌ఫేక్‌లను సృష్టిస్తున్న వారిని నిషేధించటం, ఇటువంటి ఘటనలపై విచారణ జరపటం వంటి చర్యలు తీసుకోలేదు” అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
ఐటీ చట్టం స్థానంలో తీసుకురానున్న డిజిటల్ ఇండియా చట్టాన్ని(డీఐఏ) పూర్తికాని అజెండాగా మంత్రి అభివర్ణించారు. అయితే, డీఐఏపై కసరత్తులో భాగంగా జరిగిన సంప్రదింపులు గొప్ప సంతృప్తినిచ్చాయని తెలిపారు. కృత్రిమ మేధ సాయంతో సృష్టిస్తున్న డీప్‌ఫేక్‌లు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ సినీ తార రష్మిక మందన్నా ముఖంతో తయారైన ఓ డీప్‌ఫేక్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
ఎన్నికలపై ప్రభావం ఎలా?
డీప్ ఫేక్ ల ద్వారా ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తారనేది ఆసక్తిగా మారింది. దీనిపై పలువురు ఐటీ నిపుణులు ఏమన్నారంటే.. గెలిచిన వారిని ఓడినట్టుగా.. ఓడిపోయిన నేతలను గెలిచినట్టుగా వికృత ప్రచారానికి అవకాశం ఉందని.. ఇది ప్రజలను గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతేకాదు.. ఎన్నికల సంఘం నిబద్ధతను సైతం ప్రశ్నార్థకం చేస్తుందని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ నాయకుల వ్యాఖ్యలను మార్చేసి.. విపరీత అర్థాలు వచ్చేలా ప్రచారం చేసేందుకు కూడా డీప్ ఫేక్‌లో అవకాశం ఉందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates