జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ నిన్న 50వ పడిలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ట్విట్టర్ లో పవన్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ క్రమంలోనే వైసీపీ రెబల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పవన్ ప్రశంసలు కురిపించారు. రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలిపిన పవన్… రఘురామకృష్ణరాజును పొగడ్తలతో ముంచెత్తారు. దేవాలయాలు, వారసత్వ సంపదనను కాపాడేందుకు కృషి చేసిన రఘురామకృష్ణరాజు శ్రమకు పవన్ అభినందనలు తెలియజేశారు.
గతంలో టీటీడీకి చెందిన ఆస్తులు అమ్మాలని ఏపీ ప్రభుత్వం భావించడంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ వ్యవహారంలో సొంత పార్టీ పైనే రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన భూములు, ఆస్తులు విక్రయిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆర్ ఆర్ ఆర్ చెప్పారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు.
అయితే, రఘురామ వ్యాఖ్యల తర్వాత మరి కొన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో టీటీడీ ఆస్తుల్ని అమ్మడం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రఘురామపై పవన్ ప్రశంసలు కురిపించారు.
అయితే, ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు నేపథ్యంలో రఘురామపై పవన్ ప్రశంసలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పటికే, వైసీపీపై రఘురామ విమర్శల వెనుక బీజేపీ ఉందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక, తాజాగా పవన్, రఘురామల సంభాషణ ఈ పుకార్లకు ఊతమిచ్చేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నికల్ గా ప్రస్తుతానికి రఘురామ వైసీపీ ఎంపీనే. అటువంటి రఘురామకు పవన్ పొగిడారంటే….అది కాషాయబంధమే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.