ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని.. తక్షణమే రంగంలోకి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తాజాగా లేఖ సంధించారు. వైసీపీ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి, వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ లేఖలో కోరారు.
లేఖలో పేర్కొన్న వివరాలు ఇవీ..
1. పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.35,141 కోట్ల నిధులను వెచ్చించింది. ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో గోల్ మాల్ జరిగింది. నిధులు పక్కదారి పట్టాయి.
2. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోంది. దీనిపై అనేక సందేహాలున్నాయి.
3. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోంది.
4. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో 21.87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారు.
5. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లే అవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు.
6. ఈ మొత్తం పథకంలో ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు.
7. పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసింది. పీఎంఏవై (అర్బన్, రూరల్), జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు.
8. ఈ మొత్తం పథకంలో ఉన్న అన్ని విషయాలను గమనించి ఈ పథకం అమలు తీరుపై సీబీఐతోపాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న అవినీతి బయటపడే అవకాశం ఉంది. వేల కోట్లు ప్రజా ధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో బయటపడుతుంది. – అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.