విష్ణు ఈ సారైనా ఖ‌ర్చు చేస్తారా?

పార్టీ ఏదైనా నాయ‌కుడు ఎవ‌రైనా.. విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో సొమ్ములు తీయాల్సిందే. వాటిని కూడా తాను నేరుగా ఖ‌ర్చు పెట్టే ప‌రిస్తితి లేదు. లోక‌ల్‌గా ఉండే నాయ‌కుల‌తోనే పంపిణీ చేయాలి. అప్పుడు ప్ర‌జ‌ల చేతులు త‌డిచేది.. ఓట్లు ప‌డేది! ఇది నేత‌లెరిగిన స‌త్యం. 2019 ఎన్నిక ల్లో టీడీపీ నాయ‌కులు ఈ విష‌యంలోనే బోల్తా కొట్టార‌నే వాద‌న ఉంది. పై నుంచి సొమ్ములు వ‌చ్చినా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ఖ‌ర్చు రాసేశారు.

దీంతో ప్ర‌జ‌ల చేతికి పావ‌లా అంద‌లేదు. ఇది చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని బ‌ల‌మైన దెబ్బ కొట్టింది. ఇక‌, ఇప్పుడు.. ఇదే త‌ర‌హా క‌ష్టం.. వైసీపీ ఎమ్మెల్యేకు కూడా ఎదుర‌వుతోంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇది చిత్రంగా అనిపించినా నిజ‌మేన‌ని అంటున్నారు. వైసీపీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకే ఈ సీటును ఇస్తార‌నే ప్ర‌చారం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డ ఎన్ని సీట్లు మారినా.. త‌న సీటుకు ఎలాంటి ఢోకా లేద‌ని విష్ణు కూడా క‌ర్చీఫ్ వేసుకుని కునుకు తీస్తున్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ,ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి టీడీపీ నేత‌, బొండా ఉమామ‌హేశ్వర‌రావు ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌న‌పై 25 ఓట్ల తేడాతో విష్ణు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇప్పుడు బొండాపై పెరిగిన సానుభూతి, టీడీపీపై పెరిగిన అంచ‌నాల నేప‌థ్యంలో విష్ణు మ‌రింత క‌ష్ట‌ప‌డ డంతోపాటు.. ఖ‌ర్చు కూడా చేయాల్సి ఉంటుంద‌ని పార్టీలోనే చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య వ‌స్తోంది.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో నేరుగా విష్ణు ఖ‌ర్చు పెట్ట‌కుండా.. స్థానికంగా ఉన్న కార్పొరేట‌ర్ల‌తో(అప్ప‌టి) ఖ‌ర్చు చేయించారు. ఇలా ఖ‌ర్చు చేసిన వారికి ఇప్ప‌టికీ సొమ్ము తిరిగి చెల్లించ‌లేదు. దీంతో వారు ఇప్ప‌టి కీ ఎమ్మెల్యే కార్యాల‌యం చుట్టూ కాళ్ల‌రిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇక‌, ఇప్పుడు మ‌రో మూడు మాసాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ సొమ్ముల‌కు వీరినే ఆశ్ర‌యించాలి. వీరి ద్వారానే పంపిణీ చేయాలి.

అయితే.. ఇంత‌కీ సొమ్ములు వారికి ఇస్తే.. పాత బ‌కాయి కింద జ‌మ చేసుకుంటారా? లేక‌.. ప్ర‌జ‌ల‌కు పంచుతారా ? అనేది ఎమ్మెల్యేగారి అంత‌ర్మ‌థ‌నం. పోనీ వీరికి సెటిల్ చేసేద్దామంటే.. మ‌న‌సు అంగీక‌రించ‌డం లేదట‌. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నికల్లో లెక్క‌కు మించి సొమ్ములు ఖ‌ర్చయితే.. ప‌రిస్థితి ఏంట‌ని వ‌గ‌రుస్తున్నార‌ట‌. సో.. మొత్తానికి సొంత లోక‌ల్ నాయ‌కుల నుంచే ఎమ్మెల్యేగారికి సెగ త‌గులుతోంద‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ఎమ్మెల్యే ఏం చేస్తారో చూడాలి.