తాజాగా రేవంత్ రెడ్డి బయటపెట్టిన ల్యాండ్ క్రూయిజర్ల ఆచూకి బయటపడింది. రేవంత్ చిట్ చాట్ గా మాట్లాడుతు కేసీయార్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచిపెట్టినట్లు చెప్పారు. రేవంత్ బయటపెట్టిన విషయం సంచలనంగా మారింది. కేసీయార్ ప్రభుత్వం ల్యాండ్ క్రూయిజర్లు కొనటం ఏమిటి ? వాటిని విజయవాడలో దాచిపెట్టడం ఏమిటనే విషయంపై జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. దాంతో క్రూయిజర్ల కార్ల ఆచూకీ కోసం ఇంటెలిజెన్స్ అధికారులు ఆరాలు మొదలుపెట్టారు.
విజయవాడకు వెళ్ళిన ఇంటెలిజెన్స్ అధికారులకు ల్యాండ్ క్రూయిజర్లు కనబడ్డాయి. విజయవాడ వీరపనేని ఇండస్ట్రియల్ పార్క్ లోని త్రినయిని ఇంజనీరింగ్ వర్క్స్ లో 22 కార్లున్నట్లు కనుక్కున్నారు. ఈ 22 కార్లను బుల్లెట్ ప్రూఫ్ చేయించటంతో పాటు శాటిలైట్ ఆధారిత జీపీఎస్ సాంకేతికతను ఏర్పాటుచేయటం కోసమే విజయవాడలో ఉంచినట్లు తెలుసుకున్నారు. అయితే ఈ కార్లకు ఇంకా బుల్లెట్ ప్రూఫింగ్ జరగలేదని సమాచారం. కాబట్టి బుల్లెట్ ప్రూఫింగ్ జరగాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ ప్రభుత్వం రు. 66 కోట్లు పెట్టి 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలుచేసింది. ఎందుకంటే మూడోసారి ముచ్చటగా తానే అధికారంలోకి వస్తానన్న నమ్మకంతోనే. నిజానికి ఇంత ఖరీదైన కార్లను కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే కేసీయార్ కు రెండు కాన్వాయ్ లు ఉన్నాయి. అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లే. ఒకవైపు అప్పుల మీద అప్పులు చేస్తు, మరోవైపు చెల్లించాల్సిన కోట్ల రూపాయల బిల్లులను నిలిపేసి, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవని చెప్పిన కేసీయార్ 66 కోట్ల రూపాయలతో ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొనుగోలు చేయటం అవసరమా ? అనే చర్చ ఇపుడు జనాల్లో మొదలైంది.
జనాల సొమ్ముతో కేసీయార్ చేసుకున్న షోకులపై జనాలు ఇపుడు మండిపోతున్నారు. బ్రహ్మాండంగా ఉన్న సెక్రటేరియట్ భవనాలను అవసరం లేకపోయినా కూలగొట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చులు చేసి కొత్త భవనం కట్టించటంపైన కూడా జనాల్లో బాగా వ్యతిరేకతుంది. పైగా కొత్తగా కట్టిన భవనం బాగా నిసిరకంగా తేలింది. మరి ఈ కొత్తకార్లను రేవంత్ ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాలి.