ఆ మంత్రికి నో చెబుతున్న జగన్ ?

జగన్మోహన్ రెడ్డికి గట్టి మద్దతుదారుడిగా, అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ముద్రపడిన మంత్రి జోగు రమేష్ కు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కదా ? వైసీపీ నేతల సమాచారం ప్రకారమే కాకుండా మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అలాగే అనుకోవాల్సొస్తోంది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం సర్వే వివరాలను బట్టి జోగికి గ్రౌండ్ రిపోర్టు అంత అనుకూలంగా లేదని సమాచారం. జోగిమీద అనేక కారణాలతో జనాల్లో మైనస్ ఉందని రిపోర్టులో వచ్చిందట. అందుకనే పెడనలో టికెట్ ఇవ్వకుండా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయిస్తే ఎలాగుంటగుందనే ఆలోచన జగన్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

అలాగని లోక్ సభ టికెట్ ఖాయమేనా అంటే అదికూడా గ్యారెంటీ లేదని పార్టీలో టాక్ వినబడుతోంది. జగన్ తో తనకున్న సన్నిహితం కారణంగా రాబోయే ఎన్నికల్లో టికెట్ కు ఢోకా లేదని ఒకపుడు జోగి బలంగా నమ్మారు. అయితే పరిస్ధితులన్నీ తారుమారైపోతున్నాయి. జగన్ కు ఎంతో సన్నిహితమని అనుకునే మరికొందరికి కూడా టికెట్లు ఇచ్చేదిలేదని జగన్ స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇదే పద్దతిలో జోగికి కూడా జగన్ టికెట్ ఇచ్చేదిలేదని స్పష్టంగా చేప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

పెడనలో ఒక మహిళా నేతకు టికెట్ ఇస్తున్నట్లుగా ప్రచారం పెరిగిపోతోంది. కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికకు పెడనలో టికెట్ ఖాయమైందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. జోగి అయినా ఉప్పాలైనా బీసీ నేతలే. అయితే మహిళ అవ్వటంతో పాటు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా మంచి పేరుండటం ఉప్పాలకు బాగా కలిసి వచ్చే అంశంగా జగన్ భావించారట.

ఉప్పాల అభ్యర్థిత్వంపై జరిగిన సర్వేలో ఆమెకు మంచి సానుకూలత కనబడిందట. జిల్లా పరిషత్ ఎన్నికల్లో గుడ్లవల్లేరు జడ్పీటీసీగా పోటీచేసిన ఉప్పాల హారిక 12,744 ఓట్ల మెజారిటితో గెలిచారు. తర్వాత జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గానే ఉన్నారు. దాంతో పెడన నియోజకవర్గంలోని అన్నీ వర్గాల్లో ఆమెకు మంచి పేరొచ్చినట్లు సర్వేల్లో తేలింది. అందుకనే జోగికి బదులుగా ఉప్పాలే అభ్యర్ధని అంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.