నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే, వైసీపీ నుంచి కొన్నాళ్ల కిందట సస్పెన్షన్ వేటు పడిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం టీడీపీలోఉన్నారు. ఇటీవలే ఆయన సతీసమేతంగా పార్టీ కండువా కూడా కప్పుకొన్నారు. అయితే.. ఆయన ఆశిస్తున్నట్టుగా ఉదయగిరి టికెట్ ఆయనకు దక్కేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంపై ఇప్పటికే చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉదయగిరి టికెట్‌ను వేరేవారికి ఇచ్చేస్తూ.. చంద్రబాబు తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదేసమయంలో మేకపాటిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. కడప, నెల్లూరు జిల్లాల్లో టీడీపీని గెలిపించే బాధ్యతను ఆయన అప్పగించారని సమాచారం. తాజాగా ఆయన కడపలోనూ పర్యటించారు. ఇక్కడి టీడీపీ నాయకులతోనూ భేటీ అయ్యారు.
ఇక, నెల్లూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం సర్వేపల్లి, నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావలి వంటి నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించే బాద్యతను ఆయనకు అప్పగించినట్టు సమాచారం. దీంతో ఆయన వ్యూహ రచన కూడా ప్రారంభించినట్టు చర్చ సాగుతోంది. ఇక, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మేకపాటికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్టు టీడీపీ లో అత్యంత కీలకమైన నాయకుడు వెల్లడించారు.
“ఆయన సేవలను మరో రూపంలో వినియోగించుకోవాలని అధినేత నిర్ణయించుకున్నారు. ప్రస్తుతంసీమలో పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగించనున్నారు. అది కూడా కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మేకపాటికి బాధ్యతలు అప్పగిస్తారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఆయన కోరిక మేరకు రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారు” అని ఆ నేత వివరించారు. సో.. దీనిని బట్టి మేకపాటికి కోరిక నెరవేరుతోందనే చర్చ సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates