రాష్ట్రంలో కీలక రాజకీయంగా మారిన వ్యవహారం జనసేన వర్సెస్ కాపులు. వచ్చే ఎన్నికల్లో కాపులు జన సేనకు మద్దతుగా ఉంటున్నారా? ఉండడం లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాపుల అభిప్రాయాలు తెలుసుకోవడంలోనూ.. వారి నాడిని పట్టుకోవడంలోనూ జనసేన అధినేత పవన్ విఫలమ య్యారా? అనేది కూడా ఆసక్తిగా మారింది. జనసేన పార్టీనిస్థాపించి పదేళ్లు దాటిపోయాయి. అయినప్పటి కీ.. ఇప్పటికీ సిద్ధాంతంలో రాద్ధాంతం కొనసాగుతూనే ఉంది.
ముఖ్యంగా పార్టీ అదినేత పవన్.. ఒక దిశాగమనంలో పయనిస్తున్నట్టుగా కనిపించడం లేదు. కొన్నాళ్లు.. తమకు అధికారం ఎందుకు రాకూడదని ప్రశ్నిస్తారు. మరి కొన్నాళ్లు కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడదా? అని అంటారు. తర్వాత.. అనూహ్యంగా అదే నోటితో పదవులు అవసరం లేదని చెబుతారు. ఇకొన్నాళ్లు తమ పార్టీకి పాతికేళ్ల ప్రస్థానం ఉందని అంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. తనను ప్రశ్నించనే కూడదనే ధోరణిలో ఆయన వ్యాఖ్యలు చేయడం మరింత ఇబ్బందిగా మారింది.
వాస్తవానికి ఇప్పుడున్న పార్టీలకు.. అది ఏదైనా.. సామాజిక వర్గాల బలం కీలకం. ఈ కోణంలో చూసుకుం టే.. జనసేనకు కాపుల బలం ఉండి తీరాలి. గతంలో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి వెంట దాదాపు కాపు లు నిలబడ్డారు. ఆ పరిస్థితి జనసేనలో కనిస్తుందా? అంటే.. తర్జన భర్జన కొనసాగుతోందనే చెప్పాలి. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది మరింత పీక్ స్థాయికి చేరుకుంది. దీంతో కాపులను జనసేన అధినేత అర్ధం చేసుకోవడం లేదా? లేక.. వారికే పవన్ అర్ధం కావడం లేదా? అనేది చర్చగా మారింది.
వాస్తవానికి కాపులకు చాలానే యాస్పిరేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ల నుంచి అధికార పదవుల వరకు.. రాజ్యాధికారం నుంచి రాజకీయాల్లోనూ వారు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా జనసేనతో సాకారం అవుతాయని కలలు కన్నారు. ఈ దిశగానే పవన్‌తో కలిసి అడుగులు వేశారు.కానీ, జనసేన వైఖరి వారిని మెప్పించేదిగా లేకపోవడం.. అడుగడుగునా.. పంథానుమార్చుకుంటూ పోతుండడంతో కాపులు అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. మరి ఎప్పటికి ఈ తర్జన భర్జనకు తెరపడుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates