ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తమ్ముళ్లకు పక్కా ప్లాన్ ఉండాలని ఆయన సూచించారు. అదే సమయంలో తటస్థులు టీడీపీకి జై కొడతామంటే ఆహ్వానిస్తామని ప్రకటించారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాల యంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాజధానిని విశాఖకు మారుస్తామని.. చెబుతూ కార్యాలయాలను తరలించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మరో మూడు నెలల్లో ఇంటికి పోయే జగన్ రాజధానిని విశాఖపట్నానికి మారుస్తాడట. కోర్టులు చివాట్లు పెట్టినా సీఎం జగన్ రెడ్డి సిగ్గుపడట్లేదు. తటస్తులను టీడీపీలోకి వస్తాను అంటే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. అక్రమ కేసులకు భయపడి ప్రజలు బయటకు రాకుంటే, మీ జీవితాలకు మీరే మరణ శాసనం రాసుకున్నట్లు అవుతుంది. నేను అందరి వాడిని కానీ ఏ ఒక్కడి వాడిని కాదు. ఎక్కడ సమస్యలు ఉంటే నేను అక్కడ ఉంటాను. 40 ఏళ్ల అనుభవంతో కష్టపడతా, ప్రజల కష్టాలు తీరుస్తాను” అని చంద్రబాబు అన్నారు.
ఇక, వైసీపీ ప్రభుత్వం మహిళలకు త్వరలోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు వస్తున్న వార్తలపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాపీ కొట్టి అమలు చేస్తానంటున్నారని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినంత మాత్రాన నిత్యావసరాలు, అధిక విద్యుత్ చార్జీల బిల్లులు, ధరలు రూపేణా దోచింది తిరిగి ఇస్తాడా? అని నిలదీశారు.
రాబోయే ఎన్నికలు 5కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. “జగన్ లా విలువలు లేని రాజకీయాలు ఎవ్వరూ చేయలేదు. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరోధక చర్యలు లేవు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు రోజుల పాటు నిర్వహించిన పలు యాగాలు, పూజలు, యజ్ఞాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. సందర్భంగా చంద్రబాబు యాగాల్లో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates