విజయనగరం జిల్లాలో జరిగిన ‘యువగళం-నవశకం’ బహిరంగ సభలో సీఎం జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. సైకో జగన్ పాలనలో యువగళం పాదయాత్రపై దండయాత్ర జరిగిందని, పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నో ఇబ్బందులు సృష్టించారని చంద్రబాబు మండిపడ్డారు. తమకు రాజకీయ వ్యతిరేకత మాత్రమే ఉంటుందని, వ్యక్తిగత వ్యతిరేకత ఉండదని చంద్రబాబు చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటును కాపాడుకోవాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జగన్ కు కక్ష సాధింపు తప్ప మరొకటి తెలియదని, విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు మెట్రో రైలు పోయి గంజాయి రాజధానిగా మారడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను జగన్ సర్కార్ తరిమికొట్టిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ కబ్జా కోరలలో ఉత్తరాంధ్ర నలిగిపోతోందని, అమరావతిని జగన్ సర్వనాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 కోట్లతో విలాసాల భవనాన్ని జగన్ నిర్మించుకున్నాడని, ప్రజాధనాన్ని వృథా చేసే హక్కు జగన్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాజధాని అంటూ జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నాడని, బాబాయ్ ని హత్య చేసి ఎవరో హత్య చేసినట్టుగా చెబుతున్నాడని ఆరోపించారు.
టీడీపీ, జనసేన పొత్తు చరిత్రాత్మకమని, ఇరు పార్టీల కార్యకర్తలు, నేతలు సహకరించుకోవాలని చంద్రబాబు కోరారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని, సైకో ముఖ్యమంత్రి జగన్ ను అని చంద్రబాబు చెప్పారు. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారని…టీడీపీ, జనసేన మద్దతుదారులు, ప్రజలు రోజుకోసారి ఓటు చెక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తామని, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలోనే అమరావతి, తిరుపతిలో పవన్ తో కలిసి సభలు నిర్వహిస్తామని అన్నారు. ఆ సభల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని అన్నారు. సూపర్ సిక్స్ తరహాలో మరిన్ని పథకాలు ప్రకటించబోతున్నామని చంద్రబాబు చెప్పారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకు వస్తామన్నారు.