151 అడుగులో గోతిలో వైసీపీని పాతేస్తాం: లోకేష్

విజయనగరం జిల్లాలోని పోలిపల్లి నిర్వహించిన ‘యువగళం-నవశకం’ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజనరీ అంటే చంద్రబాబు అని, ప్రిజనరీ అంటే జగన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ అరెస్ట్ అయిన తర్వాత రోజుకో స్కాం బయటపడిందని, 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును అరెస్టు చేస్తే ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం బయటకు వచ్చిందని అన్నారు.

53 రోజులపాటు నిజాన్ని నిర్బంధించినా చివరికి సత్యమే జయించిందని చెప్పారు. చంద్రబాబు గారి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం, మరో పక్క పవన్ అన్న వారాహి యాత్రతో జగన్ కు ఫ్యాన్ కు ఉక్కపోత మొదలైందని లోకేష్ సెటైర్లు వేశారు. పవన్ అన్న ఏపీకి వస్తుంటే వైసీపీ పిరికి సన్నాసులు అడ్డుకుంటున్నారని, ఆయన విమానానికి అనుమతి రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ దెబ్బ కొట్టారని, ప్రజాస్వామ్యం తిరగబడి దెబ్బ కొడితే ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తామని హెచ్చరించారు.

పెత్తందారులకు పేదవారికి ఎన్నికలని జగన్ చెబుతుంటారని, కానీ అహంకారానికి..ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరగబోతుందని అన్నారు. జగన్ అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతి పెడతానంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజనరీ చంద్రబాబు రాష్ట్రానికి అవసరమని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేయాలి అనుకునే పవర్ఫుల్ నాయకుడు పవన్ అన్న కావాలని లోకేష్ అన్నారు. ఆడుదాం ఆంధ్రా అంటూ జగన్ కొత్త కార్యక్రమం చేపట్టారని, జగన్ ఐపీఎల్ టీమ్ కు కోడి కత్తి వారియర్స్ అని పేరు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

బాబాయ్ ను కొట్టిన సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ కుమార్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టార్ బియ్యపు మధుసూదన్ రెడ్డి వీరంతా కలిసి మామూలు టీం కాదని చురకలంటించారు. పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, నాయకుడి బాధ్యతను తెలుసుకున్నానని అన్నారు. జగన్ విధ్వంసం ప్రతి అడుగులో చూశానని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.