తెలంగాణ లోక్ సభ బరిలో సోనియా, మోడీ

మరికొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారం చేపట్టేందుకు బిజెపి, కాంగ్రెస్ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల వ్యూహంతో పాటుగా ఇటీవల ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై ఈ భేటీలో చర్చ జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పీఏసీ సమావేశంలో లోక్ సభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి విషయాలపై కూడా చర్చించారు. లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్చార్జ్ లను నియమించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాల బాధ్యతలు అప్పగించారు. నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ కు పొన్నం లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ఈసారి తెలంగాణ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి స్థానం నుంచి మోడీ పోటీ చేసేందుకు మోడీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాదిలో బలపడలాలని భావిస్తున్న బిజెపి తెలంగాణపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. మోడీ పోటీ చేయడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో బిజెపికి బలం పెరుగుతుందని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. మినీ ఇండియాగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉండే మల్కాజ్ గిరి ప్రాంతం నుంచి మోడీ పోటీ చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి రేవంత్ రెడ్డి గెలుపొందారు.