ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో దర్శి టికెట్‌ను బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఇవ్వాలని పార్టి నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, నియోజకవర్గంలోనూ.. మద్దిశెట్టికి, బూచేపల్లికి మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. వైరి వర్గాలు మారిపోయాయి.
పలితంగా ఇది తన సీటేనని.. 2019 ఎన్నికల్లో తాను తప్పుకోబట్టే.. వేరేవారికి(పేరు కూడా చెప్పకుండా) టికెట్ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో తనేపోటీ చేస్తానని బూచేపల్లి ప్రచారం చేసుకుంటున్నారు.ఇక, ఆయన అనుచరులు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఇదే ప్రచారం చేస్తున్నారు. దీంతో గత రెండున్నరేళ్లుగా బూచేపల్లి వర్సెస్ మద్దిశెట్టి వర్గాల మధ్య రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మద్దిశెట్టి జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం తెరమీదికి వచ్చింది.
ఆయనకు చెందిన కాలేజీ విద్యార్థులను ఎక్కడకు తరలించినా.. వారు జనసేన జెండాలు పట్టుకోవడం.. పవన్ నినాదాలు చేయడం వంటివి ఆసక్తిగా మారాయి. దీంతో మద్దిశెట్టి టికెట్ దక్కకపోతే.. ప్లాన్ బీ ఉందనే ప్రచారం ఉంది. అయితే.. ఇప్పటి వరకు జనసేన విషయంపై మద్దిశెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇంతలోనే.. దర్శి నియోజకవర్గానికి చెందిన యువ పారిశ్రామిక వేత్త.. గరికపాటి వెంకట్..జనసేనలో చేరిపోయారు.
ఎన్నారై అయిన.. గరికపాటి వెంకట్.. ప్రస్తుతం సామాజిక సేవలో ముందున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే.. పోటీ చేయాలనేది ఆయన ఆశ. ప్రస్తుతం ఆ విషయాన్నిపైకి చెప్పకపోయినా.. ఆయన అంతర్గత ఉత్సాహం అంతా కూడా టికెట్‌పై ఉంది. సరే.. టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. మద్దిశెట్టి ఇప్పుడు జనసేనలోకి వచ్చినా.. దర్శి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. పొత్తులోభాగంగా ఈ టికెట్‌ను జనసేనకు టీడీపీ కేటాయించినా.. వెంకట్ వైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తంగా మద్దిశెట్టికి గేట్లు దాదాపు మూసుకుపోయాయా? అనేది ఆసక్తికర చర్చ.