టీడీపీ-జనసేన పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక, ఇప్పుడు టికెట్ల వ్యవహారం మాత్రమే తేలాల్సి ఉంది. అధికారంలోకి వచ్చాక పదవుల వ్యవహారంపై దృష్టి పెడతామని జనసేన అధినేతపవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే.. అధికార వైసీపీ ఒకింత ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవైపు ఇరు పార్టీలు కలవకూడదని అనుకున్నా.. కలిసి పోటీకి రెండు పార్టీలూ రెడీ అయిపోయిన దరిమిలా.. వ్యూహాలు మారుస్తోంది.
ఇక, జనసేన-టీడీపీ కలిస్తే.. అద్భుతాలు జరుగుతాయా అని ప్రశ్నించేవారికి.. మూడు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో 2019లో ఏం జరిగిందో ఒక్కసారి చూస్తే.. విషయం అర్ధమవుతుందని టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన కలిస్తే.. ఇక గెలుపేనని ఈ ధైర్యంతోనే ఉన్నామని అంటున్నాయి. ఉదాహరణకు.. కొన్ని నియోజక వర్గాల ఫలితాలను పరిశీలించినా.. ఇది నిజమేనని అనిపిస్తోంది.
- ఉమ్మడి గుంటూరులోని గురజాలలో గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలి పోయాయి. టీడీపీకి ఇక్కడ 88,591 ఓట్లు రాగా జనసేనకు 12503 ఓట్లు వచ్చాయి. ఈ రెండు కలిస్తే.. మరిన్ని ఓట్లు పడడం ఖాయం. దీంతో ఇక్కడ గెలుపును రాసిపెట్టుకోవచ్చని అంటున్నారు.
- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన టికెట్‌ను సీపీఎంకు కేటాయించారు. ఈ పార్టీ అభ్యర్థి ఓట్లు చీల్చడంతో ఏకంగా 29333 ఓట్లు ఆ పార్టీకి పడ్డాయి. ఇక, టీడీపీకి 70696 ఓట్లు వచ్చాయి. జనసేన-టీడీపీ కలిస్తే.. ఈ జట్టు గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని అంటున్నారు.
- విశాఖజిల్లా గాజువాకలో జనసేన అధినేత పవన్ ఓడిపోయారు. అయితే.. ఇక్కడ కూడా టీడీపీ ఓట్లు చీలిపోయాయి. జనసేనకు 56125 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 54642 ఓట్లు వచ్చాయి. ఇక, వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేకి 74645 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. టీడీపీ-జనసేన పోటీ చేసి ఉంటే.. గెలుపును రాసిపెట్టుకునే వారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో పరిస్థితి కనిపిస్తోంది. దీనిని అంచనా వేసుకునే.. ఇప్పుడు జనసేన-టీడీపీ వ్యూహాత్మకంగా చేతులు కలిపాయని అంటున్నారు.