రెండేళ్లలో 12వేల అమెరికన్లకు జాబ్స్ ఇస్తామన్న భారత ఐటీ దిగ్గజం

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండేళ్ల వ్యవధిలో దాదాపు పన్నెండువేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రణాళికల్నిసిద్ధం చేసినట్లుగా ఆ కంపెనీ వెల్లడించింది.

ఐదేళ్లలో పాతిక వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయానికి తాము కట్టబడి ఉన్నామని.. దీనికి తగ్గట్లే గడిచిన మూడేళ్లలో 13 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఆ సంస్థ స్పష్టం చేసింది.

హెచ్ 1 బీ వీసాదారులకు వర్క్ వీసాలకు సంబంధించి ట్రంప్ సర్కారు అనేక నిబంధనల్ని విధించిననేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ కీలక ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ ట్రంప్ సర్కారు కానీ నిబంధనల్ని విధించకుంటే.. ఈ ఉద్యోగాల్లో ఎక్కువగా భారతీయులకే సొంతమయ్యేవి. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో భారతీయుల ప్రయోజనాలకు అంతో ఇంతో నష్టం వాటిల్లినట్లేనని చెప్పక తప్పదు.

2020 జూన్ తో ముగిసే త్రైమాసికానికి ఇన్ఫోసిస్ లో 2.39 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గడిచిన మూడేళ్లలో అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇన్ఫోసిస్ ఎక్కువగా ఫోకస్ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా కలకలం రేపుతున్న వేళ.. కొత్త ఉద్యోగాల విషయంలో ఇన్ఫోసిస్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన భారతీయులకు బ్యాడ్ న్యూస్ గా చెప్పక తప్పదు.