రేవంత్‌కు పంట‌ల బీమాకు, రైతు బీమాకు తేడా తెలీదు!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ బీఆర్ ఎస్‌నేత‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర స్థాయిలో జ‌రిగింది. రేవంత్ చేసిన‌ వ్యాఖ్యలకు కేటీఆర్ గ‌ట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నారని.. ఇది గాంధీ భవన్ కాదనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రేవంత్‌కు పంట బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదని ఆరోపించారు. రేవంత్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని అన్నారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. ఇసుక మాఫియా అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. 2014-2023 వరకు ఇసుకపై రూ.5వేల కోట్లు వచ్చాయని కేటీఆర్ వివ‌రించారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా ఉండేదని.. అందుకే అప్పట్లో రూ.4 కోట్ల ఆదాయం కూడా రాలేదని విమ‌ర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక ఆదాయం ఎటుపోయిందో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

తెలంగాణ రాకముందు, జవహర్‌లాల్ నెహ్రూ తరం నాటి రాజకీయాలను ప్రస్తావించడంతో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొలడంతో స్పీకర్ సభను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. అయితే, స‌భ‌లో భారీ ఎత్తున గంద‌ర‌గోళం నెల‌కొంది. అధికార పార్టీ నుంచి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు బీఆర్ ఎస్ స‌భ్యుల‌కు పోటా పోటీగా స‌మాధానం ఇచ్చారు. కాంగ్రెస్ గెలిచి ఉండ‌క‌పోతే.. రాష్ట్రం మ‌రో ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చేంద‌ని శ్రీధ‌ర్‌బాబు అన‌డంతో బీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌తిఘ‌టించారు. ఈ క్ర‌మంలోనే బుధ‌వారానికి వాయిదా ప‌డింది.