ఆ వ‌ర్గాల‌కు 9 సీట్ల‌తో స‌రి.. వైసీపీ స్ట్రాట‌జీ.. !

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఏపీ అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే అసెంబ్లీ సీట్ల‌పై దృష్టి పెట్టిన వైసీపీ.. మార్పులు చేర్పుల విష‌యంలో ఎలాంటి మొహ‌మాటాలకూ తావు లేకుండా ముందుకు సాగుతోంది. ఇక‌, కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి మార్పుల దిశ‌గానే అడుగులు వేస్తోంది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో బీసీల‌ను, ఓబీసీల‌ను మ‌చ్చిక చేసుకునే దిశ‌గా వైసీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

దీనిలో భాగంగా మొత్తం 25 స్థానాల్లో 11 సీట్ల‌ను ఓబీసీలు, బీసీల‌కే కేటాయించ‌నున్న‌ట్టు తాజాగా చ‌ర్చ సాగుతోంది. వీరిలోనూ ఇప్పుడున్న వారిని ప‌క్క‌న పెట్టి ఆయా వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నాయ‌కు ల‌ను పెద్ద‌పీట వేయాల‌ని.. వారికే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. దీంతో మొత్తం 11 స్థానాలు కూడా దాదాపు ఓబీసీల‌కే రిజ‌ర్వ్ అయిపోయాయ‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. వీరిని ఎంపిక చేయాల్సి ఉంది.

ఇక‌, మిగిలిన 14 స్థానాల్లో 9 మాత్ర‌మే జ‌న‌ర‌ల్ కు కేటాయించుకునే అవ‌కాశం ఉంది. ఇత‌ర ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీలో ఉన్నాయి. అమ‌లాపురం, చిత్తూరు, బాప‌ట్ల‌, తిరుప‌తి ఎస్సీల‌కు, అర‌కు ఎంపీ సీటును ఎస్టీల‌కు ఇవ్వ‌నున్నారు. వీటిలో మార్పులేదు. అయితే, నాయ‌కుల‌ను మాత్రం మార్చ‌నున్నారు. అర‌కు ఎంపీ సీటును గొట్టేటి మాధ‌వికి కాకుండా… ఈసారి పురుష అభ్య‌ర్థికి ఇవ్వ‌నున్న‌ట్టు ఒక ప్ర‌చారం ఉంది. ఆమెను అసెంబ్లీకి తీసుకుంటార‌ని అంటున్నారు.

ఇక‌, మిగిలిన 9 స్థానాల్లోనే రెడ్లు, క‌మ్మ‌, బ్రాహ్మ‌ణ‌, కాపు సామాజిక వ‌ర్గాల‌కు టికెట్లు కేటాయించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంలోనూ ఒక క్లారిటీ ఉంద‌ని అంటున్నారు. ఈ ద‌పా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఒక ఎంపీ సీటు ఇస్తార‌ని తెలుస్తోంది. అదేవిధంగా రెండు నుంచి మూడు రెడ్లు, మూడు నుంచి రెండు.. క‌మ్మ‌ల‌కు, రెండు కాపుల‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, మైనారిటీకి ఒక స్థానం రిజ‌ర్వ్ చేశార‌ని స‌మాచారం. మొత్తానికి జ‌న‌ర‌ల్ స్థానాల్లో 9 మాత్ర‌మే ఈ సామాజిక వ‌ర్గాల‌కు ద‌క్కుతాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.