40 అడుగుదాం.. 20 గెలుద్దాం జ‌న‌సేన టార్గెట్ ఇదేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌న‌సేన‌-టీడీపీ క‌లిసి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌నే విష‌యం తెలిసిపోయింది. ఇక‌, ఇప్పుడు తేలాల్సింది.. సీట్లు మాత్ర‌మే. ఈ విష‌యం ఇప్ప‌టికే రెండు సార్లు.. ఇరు పార్టీల అగ్ర‌నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింది. కానీ, ఎటూ తేల‌లేదు. ఇటీవ‌ల మంగ‌ళ‌గిరిలో కీల‌క నాయ‌కుల‌తో భేటీ అయిన‌.. జ‌న‌సేనలో ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 స్థానాలు తీసుకోవాల‌నేది ఈ పార్టీల నేతల వాద‌న‌గా ఉంది.

కీల‌క నాయ‌కులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేష్ వంటివారు.. 40 స్థానాల‌కు త‌గ్గ‌కుండా తీసుకోవాల నే వాద‌న‌నే వినిపించార‌ని స‌మాచారం. అయితే.. ఇన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా? అనేది మ‌రో సందేశం. అయిన‌ప్ప‌టికీ… 40 స్థానాల‌కు ప‌ట్టుబ‌ట్టాల‌నేది నాయ‌కుల మాట‌. ఒక‌వేళ 40 స్థానాలు ఇచ్చినా.. ఎన్ని గెలుస్తాం? అనేది కూడా నాయ‌కులు తేల్చేశారు. వీటిలో 20 స్తానాల్లో గెలుపును ఇప్ప‌టికే రాసిపెట్టుకున్నా రనేది మ‌రోమాట‌.

వీటిలో రాజ‌మండ్రిరూర‌ల్‌, కాకినాడ సిటీ/ రూర‌ల్‌, న‌ర‌సాపురం, అనంత‌పురం అర్బ‌న్‌, ప్ర‌త్తిపాడు (గుంటూరు), విశాఖ ఉత్త‌రం, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, విజ‌య‌వాడ వెస్ట్‌, గుంటూరు వెస్ట్‌, నంద్యాల‌, ప‌త్తికొండ(కేఈ కుటుంబం పాగా వేయాల‌ని అనుకుంటున్న స్తానం), తాడేప‌ల్లిగూడెం, ఏలూరు, కావ‌లి, తిరుప‌తి, పుట్ట‌ప‌ర్తి, చిత్తూరు, మాచ‌ర్ల‌, స‌త్తెన‌ప‌ల్లి, న‌ర‌స‌రావుపేట‌, ద‌ర్శి స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో గెలుపు ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే.. ఆ సీట్ల‌లో చాలా వ‌రకు టీడీపీకి బ‌ల‌మైన కంచుకోట‌లుగా ఉన్నాయి. వీటిని వదులు కోవ‌డం పార్టీకి కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన కోరిక‌లు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌నేది చూడాలి. అయితే.. 40 సీట్లు అడిగి.. 20 స్థానాల్లో గెలుపుపై అంచ‌నా వేసుకోవ‌డం ద్వారా.. జ‌న‌సేన చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.