ముగిసిన ‘వ‌సుంధ‌ర’ శ‌కం.. రాచ‌రికానికి స్వ‌స్తి!

వ‌సుంధ‌ర రాజే. ఈ పేరు చెప్ప‌గానే గుర్తుకు వ‌చ్చే పేరు రాజ‌స్థాన్‌. ఈ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా ఆమె త‌న‌దైన ముద్ర వేశారు. అంతేకాదు.. బీజేపీని న‌డుం క‌ట్టుకుని ముందుకు న‌డిపించిన చ‌రిత్ర కూడా సృష్టించారు. గ‌తంలో 2013-2018 మ‌ధ్య రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలోనూ.. ఆమె త‌న‌దైన పాల‌న‌తో ముద్ర వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఇక‌, ఆమె శ‌కం ముగిసింది. ప్ర‌స్తుతం వ‌సుంధ‌ర‌రాజే వ‌య‌సు 70 సంవత్స‌రాలు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ విజయం ద‌క్కించుకున్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేశారు. ఆమె గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు, భారతదేశ మొట్టమొదటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుల్లో ఒకరుగా ఉన్నారు. అయితే.. తాజాగా జ‌రిగిన రాజ‌స్థాన్ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ఆమెను కీల‌కంగా ఎంచుకున్న బీజేపీ.. ఇక్క‌డ కూడా ఇత‌ర రాష్ట్రాల మాదిరిగా గెలిచిన త‌ర్వాత ఆమెను ప‌క్క‌న పెట్టేశారు.

వాస్త‌వానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజే సూచించిన ఏకంగా 63 మంది అభ్య‌ర్థుల‌కు బీజేపీ టికెట్లు ఇచ్చింది. వారంతా గెలుపు గుర్రం ఎక్కారు. అది కూడా సగం మంది భారీ మెజారిటీ ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు తిరుగు లేద‌ని.. త‌ను మ‌రోసారి ముఖ్య‌మంత్రి పీఠం ఎక్క‌నున్నాన‌ని ఆమె భావించారు. కానీ, అనూహ్యంగా బీజేపీ పంథా మార్చేసింది. అస‌లు ఊసులో కూడాలేని భజన్‌లాల్ శర్మ అనే 56 ఏళ్ల తొలి ఎమ్మెల్యేని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టేసింది.

సంగనేర్ నియోజకవర్గం నుంచి భజన్‌లాల్ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 56 ఏళ్ల శర్మ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా మూడుసార్లు పనిచేసి బీజేపీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ వస్తున్నారు. అయితే.. ఆయ‌న పేరు సీఎం ల రేసులో ఎక్క‌డా లేదు. ముఖ్య‌మంత్రి పీఠంపై ఆశ‌తో కేంద్ర మంత్రి గ‌జేంద్ర‌షెకావ‌త్ ఇక్క‌డ పోటీ కూడా చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయినా.. మోడీ-అమిత్‌షాలు మాత్రం శ‌ర్మ‌ను ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. ఫ‌లితంగా రాచ‌రికం నుంచి వ‌చ్చిన రాజే హ‌వాకు బ్రేకులు ప‌డ్డాయి. మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆమె వ‌య‌సు 75 ఏళ్లు నిండుతాయి. దీంతో ఆమెకు పూర్తిగా గేట్లు మూసేసిన‌ట్టే అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.