జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కన్వీనర్.. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అరెస్టయ్యారు. విశాఖ పట్నంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న వెంచర్‌కు ముందు భాగంలో ఉన్న రోడ్డును వాస్తు కారణాలతో మూసేయడంపై ఉద్యమిస్తున్న నేపథ్యంలో తాజాగా చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే నాదెండ్ల సహా.. అనేక మంది జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఏం జరిగింది?
ఎంపీ ఎంవీవీ నిర్మిస్తున్న వెంచర్ వద్ద.. రోడ్డును మూసేయడాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ టైకూన్ కూడలి సమస్యపై నిరసన తెలిపేందుకు నాదెండ్ల మనోహర్ తన పార్టీ నేతలతో కలిసి బయలు దేరారు. ఈ విషయం ముందే తెలిసిన పోలీసులు ఆయన బస చేసిన హోటల్ వద్దనే అడ్డుకున్నారు. శాంతియుతంగా, ట్రాఫిక్ కు అడ్డు లేకుండా నిరసన తెలుపుతామని పోలీసులకు చెప్పినా వినలేదని జనసేన నాయకులు ఆరోపించారు.
ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సి న విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా అన్నారు. విశాఖపట్నం నగర వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసి వేసి, ప్రజలకు లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
“విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషాలు ఉండటంతో టైకూన్ కూడలి మూసివేశారు. దీనిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సోమవారం ఉదయం కూడలి వద్దకు బయలుదేరిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని నోవాటెల్ హోటల్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఆనంతరం అరెస్టు చేశారు.
ఉదయం 9 గంటలకే హోటల్ వద్దకు చేరుకొని కనీసం రూమ్ నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు” అని మనోహర్ వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates