అన్ని జిల్లాల్లో ప్రజాదర్బార్

తొందరలోనే అన్ని జిల్లాల్లోను ప్రజాదర్బార్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. మూడు రోజులుగా రేవంత్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతకుముందు పదేళ్ళు సీఎంగా ఉన్న కేసీయార్ ఒక్కరోజు కూడా ఇలా జనాల సమస్యలు విన్న పాపాన పోలేదు. నిజానికి ప్రజలతో ముఖ్యమంత్రి అని ప్రజలతో నేరుగా మాట్లాడటం మొదలుపెట్టింది చంద్రబాబు. అయితే ఆయన టీవీ ద్వారా ఫోన్లో మాట్లాడేవారు. ఇది సూపర్ హిట్టయ్యింది. తర్వాత వైఎస్సార్ దానిని ప్రజాదర్బార్ గా మార్చి నేరుగా కలిసే అవకాశం ఇచ్చారు. కాకపోేతే సీఎం దాకా రావడం ఒకింత ఇబ్బంది, వ్యయప్రయాసలతో కూడినది. అయినా జనానికి అది కూడా నచ్చింది. దాంతో ఆ కాన్సెప్ట్ కూడా హిట్టయ్యింది. అప్పట్లో సక్సెస్ అయిన కాన్సెప్టునే ఇపుడు సీఎం రేవంత్ పునరుద్ధరించారు.

అయితే ఇక్కడ చిన్న సమస్య వచ్చింది. అదేమిటంటే ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు చెప్పుకోవటానికి జనాలు రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుండో రావటం అన్నది కష్టమైన పనే. అయినా వస్తున్నారంటే ఎంత అవసరమైతే వస్తున్నారన్నది అర్ధమవుతోంది. అందుకనే బాధితులకు వీలుగా ఉంటుందని ప్రతి జిల్లాల్లోను ప్రజాదర్బార్ నిర్వహిస్తే జిల్లాల నుండి బాధితులు హైదరాబాద్ కు రావాల్సిన అవసరం ఉండదని రేవంత్ ఆలోచించారు. అందుకనే మంత్రుల ఆధ్వర్యంలో ప్రతి జిలాలోను ప్రజాదర్బార్ నిర్వహిస్తే సరిపోతుందని అనుకున్నారు.

హైదరాబాద్ లో తాను ప్రారంబించిన ఈ కాన్సెప్టును తొందరలోనే జిల్లాల కేంద్రాల్లో మంత్రుల ఆధ్వర్యంలో ప్రారంభించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. దానివల్ల జనాలు ఎక్కడెక్కడి నుండో హైదరాబాద్ కు రావటం తప్పుతుందన్నది ఆలోచన. మంత్రుల ఆధ్వర్యంలో కూడా ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయితే దీన్ని తర్వాత నియోజకవర్గాలకు విస్తరించే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారమైపోతే బాధితులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది ? అసలు సమస్యలే లేకుండా చర్యలు తీసుకోవటం ఏ ప్రభుత్వానికీ సాధ్యంకాదు. కాకపోతే ఎదురైన సమస్యలను ఎంత తొందరగా పరిష్కరిస్తున్నారు అన్నదానిపైన ప్రభుత్వ సామర్ధ్యం ఆధారపడుంది.

ముఖ్యమంత్రి క్యాంపు ఆపీసులో ప్రజాదర్బార్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా సెల్ ను ఏర్పాటుచేసినట్లే జిల్లాలస్ధాయిలో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సెల్ ను ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. జిల్లాల స్ధాయిలో పరిష్కారం సాధ్యం కానివాటినే హైదరాబాద్ కు తెప్పించుకోవాలని రేవంత్ ఆలోచిస్తున్నారు. అయితే ఎదుయ్యే సమస్యల్లో జిల్లాలస్ధాయిలో పరిష్కారమైపోయేవే చాలా ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. మరి ఈ కాన్సెప్ట్ చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.