తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా జగన్ను తప్పు పడుతున్నారని సీఎం చంద్రబాబు కూడా అంటున్నారు. దేవుడి హుండీ చోరీపై సెటిల్మెంట్ జరిగింది. దీనిపై న్యాయస్థానం కూడా విచారణకు ఆదేశించింది. వివాదం ముదురుతున్న వేళ జగన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదేదో చిన్న వ్యవహారం అన్నట్లుగా మాట్లాడారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.
బాబాయి హత్యను సెటిల్ చేయాలనుకున్న వారికి అది చిన్న విషయం అయినప్పుడు పరకామణి అంశం పెద్ద విషయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏమాత్రం నైతికత లేని వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పరకామణిపై జగన్ వ్యాఖ్యలను ఖండించారు.
తిరుమలపై ప్రతి అంశం సెంటిమెంట్ తో ముడిపడి ఉంటుంది. ఇటువంటి సున్నిత అంశంపై సెటిల్మెంట్ చేసుకున్నారు. దేవుడి హుండీలో చోరీని సెటిల్ చేయడానికి జగన్ ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. మొత్తం మీద జగన్ వ్యాఖ్యలు శ్రీవారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఏ స్థాయిలో దోపిడీ ఉందో పరకామణి వ్యవహారాన్ని చూస్తే అర్ధం అవుతుందన్నారు.
జగన్ కు దేవుడన్నా, ఆలయాల పవిత్రత అన్నా లెక్కే లేదన్నారు. నేరస్తులను వెనుకేసుకొచ్చేవారిని ఏం అనాలని, భక్తులు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రోజుల కిందట జగన్ మాట్లాడుతూ పరకామణి చోరీలో దొరికింది కేవలం తొమ్మిది డాలర్లే అని చెప్పుకొచ్చారు. దొరికింది ఎంతయినా ఇది దేవుడి సొత్తు అని, తమ మనోభావాలకు సంబంధించింది అని పలువురు భక్తులు అంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సీఎం చంద్రబాబు కూడా నేడు వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates