ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని చెబుతూ.. గతంలో నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవని అన్నారు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో లేడీ డాన్లు తయారవ్వటం ఆశ్చర్యం కలిగించింది అన్నారు. వారి తోకలు కట్ చేస్తానంటూ హెచ్చరించారు.
నెల్లూరులో గత శుక్రవారం పెంచలయ్య అనే సీపీఎం నేత హత్యకు గురయ్యారు. ఆ దారుణానికి ఒడిగట్టింది కామాక్షమ్మ ముఠా అని పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో గతంలో నిడిగుంటి అరుణ అనే మహిళ ఒక రిమాండ్ ఖైదీ తో ఆస్పత్రిలో సన్నిహితంగా ఉంటూ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె అరెస్టు కూడా అయింది. ఇప్పుడు కామాక్షమ్మ అనే మహిళ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. ఆమె చేసిన అరాచకాలకు నాలుగు రోజులు కిందట స్థానికులు ఆమె ఇంటికి కూడా కూల్చివేశారు.
కామాక్షమ్మకు వైసీపీ అండదండలు ఉన్నాయని అనుకుంటున్నారు. దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రత్యేకంగా మాట్లాడారు. వైసీపీ హయంలో లేడీ డాన్లు తయారవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నారు. కొద్దిరోజుల కిందట ప్రజా వేదిక కార్యక్రమంలో కూడా సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఊరికి ఒక మహిళ నేరస్తురాలు తయారు చేస్తున్నారంటూ వైసీపీపై నిప్పులు చెరిగారు. అయితే శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన నాటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates