బీజేపీకి ఛాన్సివ్వ‌ని జ‌గ‌న్‌.. హ‌డావుడి శంకుస్థాప‌న‌లు!

హిందూ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఏపీ బీజేపీ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా కూలిపోయిన‌, వివిధ కార‌ణాల‌తో కూల్చేసిన ఆల‌యాల పున‌రుద్ధ‌ర‌ణ పేరుతో.. ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాల‌కు పిలుపునిచ్చేందుకు రాష్ట్ర క‌మ‌లం పార్టీ నాయ‌కులు రెడీ అయ్యారు. అయితే. అనూహ్యంగా వీరికి ఆ ఛాన్స్ ఇవ్వ‌కుండానే సీఎం జ‌గ‌న్ రంగంలోకి దిగిపోయారు. హ‌డావుడిగా.. ఆయా ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. ఓటుబ్యాంకు రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టార‌నే టాక్ వినిపిస్తోంది.

ఏం చేశారంటే..

సీఎం జ‌గ‌న్‌.. గురువారం తెల్ల‌తెల్ల‌వారుతూనే విజ‌య‌వాడ‌కు వ‌చ్చేశారు.(ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌కాదు.. కారులోనే) ఏకంగా.. 216 కోట్ల రూపాయల విలువైన‌ కనక దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేశారు. దీనిలో ఆలయ పునఃనిర్మాణానికి రూ. 5.60 కోట్లు, ఇంద్రకీలాద్రిపై కొండ రక్షణ చర్యలపనుల నిమిత్తం రూ. 4.25 కోట్లు, ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ వాటర్ మేనేజ్‌మెంట్, స్కాడా ఏర్పాటు నిమిత్తం రూ. 3.25 కోట్లు, 2016 పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాల పునర్నిర్మాణంకు రూ 3.87 కోట్లు వెచ్చించ‌నున్నారు.

అదేవిధంగా కొండ దిగువున తొలిమెట్టు వద్ద ఆంజనేయ స్వామి, వినాయక ఆలయ నిర్మాణం కోసం రూ. 26 ల‌క్ష‌లు, అమ్మవారి అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.30 కోట్లు, అమ్మవారి ప్రసాదం పోటు భవన నిర్మాణం కోసం రూ. 27 కోట్లు, కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 13 కోట్లు కేటాయించారు. ఈ ప‌నుల‌కు సీఎం శంకుస్థాప‌న చేశారు. అయితే.. ఈ స‌మ‌స్య‌లు.. ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. వీటిని అనువుగా చేసుకుని బీజేపీ ధ‌ర్నాల‌కు, నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో వీటికి శంకుస్థాప‌న‌లు చేయ‌డంపై(ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే) స్థానికులు నివ్వెర పోయారు.