కాంగ్రెస్ ముందుంది ఇంకో పరీక్ష

తొందరలోనే కాంగ్రెస్ పార్టీ మరో పెద్ద పరీక్షను ఎదుర్కోబోతోంది. అదేమిటంటే లోక్ సభ ఎన్నికలు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్-మే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సుంది. అయితే తాజాగా ఐదు రాష్ట్రల్లో మూడింటిలో విజయంసాధించిన బీజేపీ మంచి ఊపుమీదుంది. కాబట్టి షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా ఇంక మిగిలున్నది పట్టుమరి ఐదు నెలలు మాత్రమే.

తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి కుదురుకోవటానికి కనీసం నెలరోజుల సమయం అవసరమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ శాఖ పనితీరు ఎలాగుందో గమనించాలన్నా, ఒకదారికి తేవాలన్నా కనీసం ఐడాదికాలం పడుతుంది. అయితే ఇక్కడ అంత వ్యవధిలేదు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ శాఖలను యుద్ధ ప్రాతిపదికను ప్రక్షాళన చేయాల్సుంటుంది. అన్నీ శాఖలను కాకపోయినా కనీసం ముఖ్యమైన శాఖలు అంటే జనాలకు ప్రతిరోజు పనుండే పోలీసు, రెవిన్యు, మున్సిపాలిటి, పంచాయితీరాజ్, వైద్యారోగ్యం లాంటి శాఖలపైన ముందుగా దృష్టి పెట్టాల్సుంటుంది.

వీటిల్లో కూడా పోలీసులు, రెవిన్యు, వైద్యారోగ్య శాఖలపైన ప్రతిరోజు ముఖ్యమంత్రి మానిటర్ చేయాల్సిందే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ను ముందు సెట్ చేయాల్సుంటుంది. అలాగే ధరణి పోర్టల్ స్ధానంలో ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవస్ధను ఏర్పాటుచేయాలంటే పెద్ద కసరత్తే జరగాలి. ఇది లక్షలాది మంది భూ యజమానులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి టాప్ ప్రయారిటి ఇవ్వాలి. బీఆర్ఎస్+కేసీయార్ ఓటమిలో ధరణి పోర్టల్ కూడా కీలకపాత్ర పోషించిందనే చెప్పాలి. కాబట్టి దీనిపై ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంతమంచిది.

ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్న వ్యవస్ధ సక్రమంగా పనిచేసేదై ఉండటంతో పాటు తప్పులు దొర్లినపుడు గ్రామస్ధాయిలోనే దాన్ని రెక్టిఫ్ చేసేట్లుగా ఉండాలి. అప్పుడే జనాలు మెచ్చుకుంటారు. అనేక కారణాలతో కేసీయార్ ప్రభుత్వం పెట్టిన కేసుల్లో నిజమైనవి ఏవో, కక్షసాధింపుతో పెట్టినవి ఏవో చూడాలి. కక్షసాధింపుతో పెట్టిన కేసులుంటే వాటిని విత్ డ్రా చేసేయాలి. మరో రెండు నెలలపాటు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వార్ ఫుట్టింగ్ చర్యలు తీసుకుంటేనే తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు వస్తాయి లేకపోతే అంతే సంగతులు.