ఆయన వయసు 72 ఏళ్లు. నిజానికి రిటైర్మెంట్ వయసు ఎప్పుడో దాటిపోయింది. పైగా ఆయన ఐఏఎస్‌గా చేసి రిటైరయ్యారు. అయినా.. ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. ఆయన నేతృత్వంలోని పార్టీనే ఎన్నుకున్నారు. దీనికి కారణం.. శషభిషలు లేకుండా.. వెనుక ముందు.. స్వలాభం కోసం చూసుకోకుండా.. రాష్ట్ర సమస్యలపై నిక్కచ్చిగా వ్యవహరించారు. మోడీ మిత్రుడే అయినా.. రాష్ట్రం విషయం వచ్చే సరికి కాలు దువ్వారు. నువ్వెంత? అన్నట్టుగా వ్యవహరించారు.
రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పారు. మణిపూర్ విధ్వంసంలో మోడీ పాత్రను ఎండగట్టారు. ఇదే అక్కడి ప్రజలను ముగ్ధులను చేసింది. సంప్రదాయానికి భిన్నంగా (ఐదేళ్లకోసారి అధికారం మార్పు) కొత్త పార్టీకి అధికారం అప్పగించింది. అదే ఈశాన్య రాష్ట్రం… మిజోరాం. ఆయనే మాజీ ఐఏఎస్ అధికారి.. లాల్‌దుహోమా.
“మీకు తెలుసు.. మోడీ నాకు ప్రాణ మిత్రుడే. కానీ, మన రాష్ట్ర ప్రయోజనాలు కాలరాస్తే.. ఊరుకోను. అందుకే ఎన్డీయేతో చేతులు కలపలేదు. మణిపూర్ అయినా.. మన రాష్ట్రమైనా.. కేంద్రం హ్రస్వదృష్టి విధానాలను ఎండగట్టడంలో వెనుకంజవేయను” అని ఎన్నికల సమయంలో లాల్ చెప్పిన మాటలు జనాలను మైమరిపింపజేశాయి. ఫలితంగా.. మిజోరాం ప్రజలు గుండుగుత్తగా ఓటెత్తారు.
స్థానిక పార్టీ అయిన జోరాం పీపుల్స్ మూమెంట్(జెడ్‌పీఎం) పార్టీని అధికారంలోకి తెచ్చేశారు. తాజాగా చేపట్టిన లెక్కింపులో ఇప్పటివరకు ZPM 26, అధికార MNF 10, BJP 3, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్ లో ఉన్నాయి. రాష్ట్రంలోని 8.57 లక్షల మంది ఓటర్లలో 80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 40 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో 18 మంది మహిళలు సహా మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
మిజోరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీ 21 సీట్లు రావాలి. అధికార మిజో నేషనల్ ఫ్రంట్, ప్రతిపక్షం జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ , కాంగ్రెస్ 40 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ 13 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. అయితే.. మాజీ ఐఏఎస్ నేతృత్వంలోని పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం అయింది. కాగా, ఒక మాజీ ఐఏఎస్ ముఖ్యమంత్రి కానుండడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.