బీఆర్ ఎస్‌కు షాకిచ్చి.. ‘తెల్ల‌’బోయిన నేత‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఇంకా కొన‌సాగుతోంది. అయితే.. ఇంత‌లోనే బీఆర్ ఎస్‌కు చెందిన అభ్య‌ర్థి, భ‌ద్రాచ‌లం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఎస్టీ నేత తెల్లం వెంక‌ట్రావు పార్టీ మారుతున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు. నిజానికి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొన‌సాగుతోంది. రిట‌ర్నింగ్ అధికారులు గెలిచిన వారికి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు కూడా అందించాల్సి ఉంది.

అయిన‌ప్ప‌టికీ.. తెల్లం వెంక‌ట్రావు.. తొంద‌ర‌ప‌డిపోయారు. ఆయ‌న ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఎస్టీ నియో క‌వ‌ర్గం భ‌ద్రాచ‌లం నుంచి బీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేశారు. ప్ర‌స్తుత కాంగ్రెస్ హ‌వాలో అనేక మంది బీఆర్ ఎస్ నాయకులు ఓడిపోయినా.. తెల్లం మాత్రం విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ ఆనందం ఇంకా తీర‌కుండానే పోలింగ్ కేంద్రం వ‌ద్దే.. ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం అయిపోయారు.

ఆవెంట‌నే కొంద‌రు ఆయ‌న‌కు బీఆర్ ఎస్ ఓడిపోయింద‌ని.. మ‌నం కాంగ్రెస్‌లోకి వెళ్దామ‌ని అన్నారు. అంతే.. ఇక‌, తెల్లం కూడా.. ఓకే చెప్పారు. ఈ నెల 8వ తారీఖున నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెల్లం వెంకట్రావు ప్రకటించారు. అయితే.. ఈ విష‌యాన్ని బీఆర్ ఎస్ నాయ‌కులు సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌కుండానే ఇలా జంపింగ్ మాట‌లు మాట్టాడ‌డంపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. ఒక‌వేళ ఈసీకి ఫిర్యాదు చేసినా.. ప్ర‌స్తుతం తెల్లం గెలుపు ఆగ‌దు కానీ.. విత్‌హోల్డ్‌లో ప‌డే చాన్స్ ఉంది. మొత్తానికి తెల్లం వెంక‌ట్రావు చేసిన ప్ర‌క‌ట‌న రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మ‌రెంత మంది బ‌య‌ట‌కు వ‌స్తారో చూడాలి.