ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనాతో దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలిసిందే. రికార్డుస్థాయిలో నమోదవుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయినప్పటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు తీసుకోవటం లేదని చెబుతున్నారు.
వీలైనంతవరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండటం.. భౌతిక దూరంపాటించటం.. అనవసరంగా బయట తిరిగే కార్యక్రమాల్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.
ఇలాంటివేళ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఆదర్శప్రాయంగా నిలవటమే కాదు.. నలుగురికి స్ఫూర్తినిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా తాజాగా రిటైర్ అయ్యారు. దీంతో ఆయనకు వీడ్కోలుకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బార్ అసోసియేషన్ సభ్యులు. సెప్టెంబరు రెండున ఆయన వీడ్కోలుకు భారీగా ప్లాన్ చేశారు.
బార్ అసోసియేషన్ వారు తన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం గురించి తెలిసి.. వారికి రాసిన లేఖ ఇప్పుడు ఆదర్శవంతంగా మారింది. తనకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన ఆయన.. కరోనా వేళ.. ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
న్యాయ వ్యవస్థకు బార్ అసోసియేషన్ తల్లిలాంటిదని.. అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనటం తాను గౌరవంగా భావిస్తానని చెప్పారు. అయితే.. ఇప్పటి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉందామన్నారు. కోవిడ్ పరిస్థితులు తగ్గిపోయిన తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేస్తే తాను హాజరవుతానని పేర్కొన్నారు. మామూలు సందర్భాల్లో ఆదర్శాలు వల్లించే వారంతా.. తమ వరకు వచ్చేసరికి వాటిని మర్చిపోతుంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించిన జస్టిస్ అరుణ్ మిశ్రా అందరికి ఆదర్శ ప్రాయులుగా చెప్పక తప్పదు.