తాజాగా జరిగిన పోలింగ్ సరళని చూసిన తర్వాత బీఆర్ఎస్ ఓటమి తప్పదనే బావన పెరిగిపోతోంది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదలచేసిన సుమారు 20 సంస్ధల్లో దాదాపు 17 సంస్ధలు కాంగ్రెస్ విజయం ఖాయమని బల్లగుద్ది చెప్పటమే. ఒకటి రెండు సంస్ధలు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబితే మరో రెండు సంస్ధలు హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశముందని కూడా జోస్యం చెప్పాయి.
సరే ఈ విషయాలను వదిలేస్తే పోటీచేసిన 17మంది మంత్రుల పరిస్ధితి ఏమిటనే చర్చలు మొదలయ్యాయి. అందుబాటులోని సమాచారం ప్రకారం చాలామంది మంత్రులు ఓటమి అంచున నిలుకచున్నట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రివర్గంలో ముగ్గురు లేదా నలుగురు మంత్రులు గెలిస్తే చాలా ఎక్కువన్నట్లుగా సమాచారం అందుతోంది. మంత్రులు హరీష్ రావు, కేటీయార్ గెలుస్తారని చెప్పుకుంటున్నారు. ఒకదశలో కేటీయార్ గెలిచినా అతికష్టం మీద గెలుస్తారని చెప్పుకుంటున్నారు. అంటే హరీష్ రావు మాత్రమే కంఫర్టబుల్ గా గెలుస్తారని సమాచారం.
వీళ్ళు కాకుండా మరో మంత్రి కచ్చితంగా గెలుస్తారని ఎవరు చెప్పలేకపోతున్నారు. పైగా గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వరరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డికి ఓటమి తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. ఒకళ్ళిద్దరు గెలుపు-ఓటముల మధ్య ఊగిసలాడుతున్నారట. ప్రచారం చేసుకుంటున్న మంత్రులకు ముందుగానే తమ ఓటమి చూచాయగా తెలిసిపోయిందంటున్నారు. ఎలాగంటే ప్రచారం సమయంలో జనాలు వీళ్ళని గ్రామాల్లోకి కూడా రానీయలేదు.
గ్రామాల్లోకి మంత్రులు ప్రచారానికి రావటం ఆలస్యం వెంటనే జనాలంతా వీళ్ళని ప్రచారం చేయనీయకుండా అడ్డుకోవటమే కాకుండా ఊర్లలో నుండి తరిమేశారు. దాంతో తమ ప్రత్యర్ధులు అంత బలవంతులు కాకపోయినా జనాల్లో వ్యతిరకత చూసిన తర్వాత తమ పరిస్ధితిపై చాలామంది మంత్రులకు అంచనాలు వచ్చేశాయి. అందుకనే పోలింగ్ మూడురోజుల ముందే చాలామంది మంత్రులు అస్త్రసన్యాసం చేసేశారు. ప్రచారం చేయటం బాగా తగ్గించేశారు. డబ్బులు దండగని ఖర్చులు కూడా పెద్దగా చేయలేదు. దీంతోనే మెజారిటి మంత్రుల ఓటమి తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది.