శిరోముండ‌న వివాదం.. ఆ కుర్రాడికి ఉద్యోగం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో రెండు రోజులుగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశం.. విశాఖ‌ప‌ట్నంలో శ్రీకాంత్ అనే కుర్రాడికి శిరోముండ‌నం చేయించ‌డం. బిగ్ బాస్ షోతో పాపుల‌ర్ అయిన నూత‌న్ నాయుడు కుటుంబం ఈ ద‌ళిత యువ‌కుడికి బ‌ల‌వంతంగా గుండు కొట్టించిన ఉదంతం సంచ‌ల‌నం రేపింది.

త‌మ ఇంట్లో దొంగ‌త‌నానికి పాల్ప‌డి ప‌ని మానేశాడ‌న్న కార‌ణంతో నూత‌న్ కుటుంబం ఈ దారుణానికి ఒడిగ‌ట్టింది. సీసీ కెమెరాలో ఈ మొత్తం ఉదంతం రికార్డ‌వ‌డం, అది సోష‌ల్ మీడియాలోకి రావ‌డంతో దీనిపై పెద్ద దుమారమే రేగింది.

ఇంత‌కుముందే ఏపీలో ఓ ద‌ళిత యువ‌కుడికి శిరోముండ‌నం చేయించిన ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. ఇప్పుడు మ‌రోసారి అలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో రాజ‌కీయంగా వేడి రాజుకుంది.

మీడియాలో, సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌నీయాంశం అవుతున్న ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతోంది. నూత‌న్ నాయుడు కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బాధిత యువ‌కుడిని విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ ప‌రామ‌ర్శించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్‌కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లుతో పాటు ఔట్ ‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వ‌బోతున్న‌ట్లు అవంతి శ్రీనివాస్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ఆయ‌న‌ అధికారులను ఆదేశించారు.

మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్‌కు అందజేశారు. ఐతే రాజ‌కీయ కోణంలో మంత్రి తీసుకున్న ఈ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.