ఆ ఐఏఎస్‌ల‌ను జైల్లో పెట్టండి: ఏపీ హైకోర్టు తీర్పు

ఏపీలోని వైసీపీ హ‌యాంలో అనేక మంది ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. వారిని కోర్టుకు పిలిపించి.. బోనులో నిల‌బెట్ట‌డం..రూల్స్‌పై వివ‌ర‌ణ తీసుకోవ‌డం వంటివి గ‌తంలో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో సీఎస్‌గా ప‌నిచేసిన వారు.. డీజీపీగా ప‌నిచేసిన గౌతం స‌వాంగ్‌లు సైతం.. హైకోర్టు మెట్లు ఎక్కిన వారే. తాజాగా ఓ కేసులో ఇద్ద‌రు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌ను జైల్లో పెట్టాలంటూ.. హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. “వారిని జైల్లో పెట్టండి. త‌మాషా చేస్తున్నారు” అని తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలోని అన్ ఎయిడెడ్ క‌ళాశాల‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని, కోర్టును ఆశ్ర‌యించిన కొంద‌రు పిటిష‌నర్ల అర్హ‌త మేర‌కు.. వారిని ఉద్యోగాల్లో నియ‌మించాల‌ని 2022, జూలై 26న హైకోర్టు రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జె. శ్యామ‌ల‌రావు, విద్యాశాఖ క‌మిష‌న‌ర్ పోలా భాస్క‌ర్‌ల‌ను ఆదేశించింది. అయితే.. వీరు ఆ విష‌యాన్ని మ‌రుగున ప‌డేశారు. దీంతో పిటిష‌న‌ర్లు మ‌రోసారి హైకోర్టును ఆశ్రయించి.. కోర్టు ధిక్క‌ర‌ణ వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. తాజాగా సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా.. త‌మాషా చేసిన అధికారుల‌ను ఉపేక్షించేది లేద‌ని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మ‌న్మ‌థ‌రావు వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జె. శ్యామ‌ల‌రావు, విద్యాశాఖ క‌మిష‌న‌ర్ పోలా భాస్క‌ర్‌ల‌ను నెల రోజుల పాటు జైలుకు పంపించాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. డిసెంబ‌రు 8న స్వ‌యంగా వ‌చ్చి జ్యుడీషియ‌ల్ రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాల‌ని ఆదేశించారు. అదేస‌మ‌యంలో ఒక్కొక్క‌రూ రూ.1000 చొప్పున జ‌రిమానా చెల్లించాల‌ని ఆదేశించింది.