తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు అన్ని పార్టీలూ అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక హామీలు గుప్పించాయి. మేనిఫెస్టోల్లో ఉచితాలను నూరిపోశాయి. నువ్వు ఒకటిస్తే..నే నాలుగిస్తా! అన్న చందంగా నాయకులు, పార్టీలు దూకుడు ప్రదర్శించారు. మొత్తానికి ఎన్నికల క్రతువు కూడా.. మరో రెండు రోజల్లో జరగనున్న పోలింగ్ ప్రక్రియతో పరిసమాప్తం కానుంది.
ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. రెండు కీలక విషయాలను ఇప్పుడు మధ్యతరగతి వర్గం తెరమీదికి తెచ్చింది. ఒకటి.. రేపు వచ్చే ప్రభుత్వం ఏదైనా.. పన్నుల మోత మోగిస్తుందా? తగ్గిస్తుందా? రెండు.. రాష్ట్రంలో 5 లక్షల కోట్ల అప్పను తీర్చే మార్గాలేంటి? ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు.. మధ్యతరగతి ఓటర్ల నుంచి వస్తున్నాయి. దీనికి కారణం.. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. వారు ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయాలి.
కాంగ్రెస్ పార్టీ అయితే.. సంక్షేమ పథకాల్లో ఏకంగా.. మహిళలకు రూ. 2500 చొప్పున నెలకు ఇస్తామంది. గ్యాస్‌ను కేవలం 500లకే ఇస్తామంది.. ఇక, పింఛన్లను రూ.5000 చేస్తామని ప్రకటించింది. రైతు బంధును రూ. 15000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఇక, బీఆర్ఎస్ కూడా తక్కువేమీ ప్రకటించలేదు. పింఛన్‌ను దఫదఫాలుగా పెంచుకుంటూ పోతామని.. ఇతర పథకాలను కూడా విరివిగా అమలు చేస్తామని ప్రకటించింది. బీజేపీ కూడా అంతే.
మరి ఇవన్నీ.. అమలు కావాలంటే.. నిధులు ముఖ్యం. కానీ, రాష్ట్ర బడ్జెట్ మాత్రం.. కేవలం రెండులక్షల కోట్ల పైచిలుకుకు మాత్రమే పరిమితం. ఇక, కేంద్రంలో వచ్చే ప్రభుత్వాన్ని బట్టి.. రాష్ట్రానికి అప్పులు వస్తాయా? రావా? అనే విషయం ఆధారపడుతుంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే.. రాష్ట్రంలో ఏర్పడే ఏ ప్రభుత్వ పార్టీ అయినా.. ఆయా పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలంటే.. తక్షణం సొమ్ము కావాలి.
మరి అప్పుడు చేయాలి? చేతిలో ఉన్న ఏకైక సాధనం.. పన్నులు పెంచేయడం. ఏపీలో ఇలానే జరిగింది. పెట్రోల్ ధరలు, ఇతర వస్తువుల ధరలను, జీఎస్టీని పెంచేశారు. ఫలితంగా ప్రజలపై విపరీతమైన భారం పడింది. ఇక, అభివృద్ది కూడా లేకుండా పోయిందనే వాదన ఉంది. మరోవైపు.. చేసిన అప్పులు తీర్చే మార్గాలను కూడా తెలంగాణ పార్టీలు మర్చిపోయాయనే టాక్ మధ్యతరగతి వర్గాల నుంచి వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates