2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ.. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఎన్నిఅవాంతరాలు వచ్చినా.. ఇబ్బందులు వచ్చినా.. ప్రజల్లోకి వెళ్లడమే ధ్యేయంగా ప్లాన్ చేసుకోవడం గమనార్హం. ఈ నెల 27 నుంచి నారా లోకేష్ పాదయాత్రను పునః ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నిలిపివేసిన పాదయాత్రను అక్కడ నుంచి ఆయన తిరిగి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి రెండో వారం వరకు జరగనుంది.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు నుంచి కేసుల విషయంలో వెసులు బాటు వచ్చింది. ఆయన రాజకీయ పార్టీకి అధినేత కాబట్టి.. ఆయనను ప్రసంగాలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టీకరించిన నేపథ్యంలో చంద్రబాబు కూడా.. వచ్చే నెల తొలి వారం నుంచి తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నారు. అదేసమయంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారు.
చంద్రబాబు అరెస్టుతో బాధ చెంది మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. నారా కుటుంబం నుంచి మహిళలు రాజకీయాల్లోకి రాలేదు కానీ.. ఇటీవల తప్పని సరి పరిస్థితిలో భువనేశ్వరి బయటకు వచ్చారు. ఆమె చేసిన ప్రసంగాలకు, ఆమె యాత్రలకు ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన లభించింది. దీనిని కొనసాగించాలా? వద్దా అనే సందేహాలకు తాజాగా తెరపడింది. ఇక నుంచి వచ్చే ఎన్నికల వరకు కూడా.. నారా భువనేశ్వరి ప్రజల్లో ఉండాలని నిర్ణయించారు.
నారా భువనేశ్వరి పర్యటనలపై కూడా రూట్ మ్యాప్ ఖరారు అవుతోంది. వారానికి మూడు రోజులపాటు ఆమె పర్యటనలు ఉండేలా కార్యక్రమం తయారవుతోంది. లోకేశ్ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నందువల్ల ఆ రాయలసీమ, ఇతర కోస్తాజిల్లాల్లో ముందుగా ఆమె పర్యటనలు ఉండేలా చూడాలని నిర్ణయించారు. మొత్తంగా ఎన్నికలకు ముందు నారా కుటుంబం మొత్తం ప్రజల్లోనే ఉండేలా పక్కా ప్లాన్ చేసుకోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates