ఏపీ హిస్టరీలో తొలిసారి కీలక ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు పాలించినా ఎవరూ సాధించని ‘రికార్డు’ సీఎం జగన్ సాధించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా.. రాష్ట్ర హైకోర్టు ఆయనకు నోటీసులు పంపడమే. ఇది ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారికి అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ జరగలేదు. పైగా.. పాలనలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కావడం మరింత చర్చనీయాంశం అయింది. కేవలం సీఎం జగన్‌కే కాకుండా..పలువురు మంత్రులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం.
ఏం జరిగింది?
రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారని.. ఈ క్రమంలో సచివులు, సీఎం కూడా.. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.
రఘురామ ఆరోపణలు ఇవీ..
- రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయి.
- ఆ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలి.
- ఇసుక, మద్యం విషయంలో భారీగా ధనం చేతులు మారుతోంది.